రుణ ప్రణాళిక లక్ష్యం రూ.2,217 కోట్లు
ABN , First Publish Date - 2020-03-13T10:38:35+05:30 IST
రుణ ప్రణాళిక లక్ష్యం రూ.2,217 కోట్లు

గతేడాదితో పోల్చితే 6 శాతం పెంపు
వ్యవసాయ రుణాలు, అనుబంధ రంగాలకు 79 శాతం
ఇతర ప్రాధాన్యతా రంగాలకు 21 శాతం కేటాయింపు
ఖరారు చేసిన జిల్లా యంత్రాంగం
ఆవిష్కరించిన కలెక్టర్ ధర్మారెడ్డి
క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు
లక్ష్యం చేరుకోవడం సవాలే
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్, మార్చి 12: 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.2,217 కోట్లతో రుణ ప్రణాళికను అధికారులు ఖరారు చేశారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు 79 శాతం మేర వెచ్చించారు. గతేడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక మొత్తాన్ని నాబార్డ్ 6 శాతం పెంచింది. లక్ష్యం రూ.వేల కోట్లలో ఉంటున్నా.. అమలుకు వచ్చేసరికి పొంతన ఉండటం లేదు. నిర్దేశించుకున్న లక్ష్యంలో వాస్తవ రుణ మంజూరు 60 శాతం దాటడం లేదు. లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం క్షేత్రస్థాయిలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. రైతుల్లో అవగాహన లేమి, బ్యాంకర్ల అలసత్వం కారణంగా లక్ష్యం నీరుగారుతోంది.
రూ.2,217 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక..
వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు ప్రాధాన్య రంగాల ద్వారా రుణాలు పొంది స్థిర ఆదాయం సాధించి అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అందుకు అనుగుణంగానే వార్షిక రుణ ప్రణాళిక రూపొందించి ఆమోదించారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవల్‌పమెంట్(నాబార్డ్) సంస్థ ఈ ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సర ప్రణాళిక జిల్లా కోసం రూ.2,217 కోట్లతో ఖరారు చేశారు. గతేడాదితో పోల్చితే ఇది 6శాతం పెంచడం గమనార్హం. వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం రూ.79 శాతం, ఇతర ప్రాధాన్య రంగాలకు 21 శాతం కేటాయించారు. ప్రణాళికలో 50 శాతానికి పైగా అంటే రూ.1,483 కోట్లుగా అంచనా వేయగా.. పాడి, గొర్రెలు, మేకల పెంపకం, వ్యవసాయ యాంత్రీకరణ, తోటల పెంపకం, ఉద్యానవనాల, భూ అభివృద్ధి, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలైన ధాన్యం నిల్వ, నీటి వనరుల అభివృద్ధి కోసం రూ.609.32 కోట్లుగా అంచనా వేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం రూ.300 కోట్లు, గృహ, విద్య, పునరుత్పాదక ఇంధనం, తదితరాలకు రూ.163 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. గతేడాదితో పోల్చితే 6శాతం అంచనాలు పెంచినట్లు కనబడుతున్నా.. అదీ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని వేసిన లెక్కల ప్రకారమే అంచనాలు రూపొందించారు. గతేడాదితో పోల్చితే వ్యవసాయ పంట రుణాలు, అనుబంధ రంగాలకు 5 శాతం తగ్గించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. అదనపు కలెక్టర్ నగేష్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణారెడ్డి, లీడ్ బ్యాంకు ఆఫీసర్ సవతి, నాబార్డ్ మేనేజర్ సిసిల్ తిమోతి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం చేరేనా?
ఏటా ప్రభుత్వం వ్యవసాయ రుణాలను భారీగా ప్రకటిస్తున్నా అమలుకు వచ్చే సరికి రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు అందడం లేదు. గతేడాది రూ.2091 కోట్లతో వార్షిక ప్రణాళిక రూపొందించగా.. రూ.1,200 కోట్లలోపే రుణ పంపిణీ పూర్తయింది. పంటరుణాలకు రూ.1,850 కోట్లకుగాను కేవలం 60 శాతం మేర మాత్రమే ఇవ్వగలిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్ష్యాన్ని చేరుకోకపోవడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా రైతులు రుణాలు రెన్యువల్ చేయించుకోవడం లేదు. రుణమాఫీ కోసం వేచి చూస్తూ రెన్యువల్‌ను పట్టించుకోవడం లేదు. దాంతో రుణ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించడంలో అధికారయంత్రాంగం దృష్టి సారించడం లేదు. అంతేగాక వర్షాలు కురవని మండలాల్లో రైతులు పంట సాగు విస్తీర్ణాన్ని కుదిస్తున్నారు. పంటలు వేయకపోవడంతో రుణాలు అందడం లేదు. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహకంలో బ్యాంకర్లు నిర్లప్తంగా వ్యవహరిస్తుండటంతో అనుకున్న మేర సాధ్యం కావడం లేదు.
లక్ష్యాన్ని చేరుకునేలా కృషి : సిసిల్ తిమోతి, జిల్లా మేనేజర్, నాబార్డ్
గతేడాది పలు కారణాలతో లక్ష్యాన్ని చేరలేకపోయిన మాట వాస్తవమే. అయితే ఈయేడు చేరేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ప్రోత్సహించేందుకు రుణ మొత్తాన్ని పెంచడం జరిగింది. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పాడి పరిశ్రమ, కూరగాయల సాగుకు అన్నదాతలకు చేయూతనిస్తాం.