మన జిల్లాలోనే కోళ్లు ఎక్కువ

ABN , First Publish Date - 2020-03-13T10:36:52+05:30 IST

మన జిల్లాలోనే కోళ్లు ఎక్కువ

మన జిల్లాలోనే కోళ్లు ఎక్కువ

జిల్లా జనాభాలో సగం మంది పనిమంతులే..

తలసరి ఆదాయం రూ.1.70లక్షలు

సర్కారు ఆస్పత్రుల వైపే రోగుల చూపు

సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట,మార్చి12: తాజాగా విడుదలైన సామాజిక ఆర్థిక సర్వేలోనూ కోళ్ల పెంపకంలో సిద్దిపేట మొదటిస్థానంలో ఉన్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 8 కోట్ల కోళ్లను పెంచుతుండగా ఇందులో 1.85 కోట్ల కోళ్లు సిద్దిపేట జిల్లాలో పెరుగుతున్నాయి. 


పశువుల పెంపకంలో 6వ స్థానం..

రాష్ట్రంలో 33 జిల్లాలుండగా పశువుల పెంపకంలో సిద్దిపేట 6వ స్థానం దక్కించుకుంది. ఇక్కడ 1,63,578 ఆవులు, ఎద్దులు, 1,67,387 గేదెలు, 5,51,526 గొర్రెలు, 1,45,909 మేకలు, 10,771 పందులు, 5530 కుక్కలున్నాయి. మొత్తంగా 10,39,266 పశువులున్నట్లు ఈ సర్వే ద్వారా తేటతెల్లమైంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 17 లక్షల పశువులున్నాయి. 


ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్‌ 

ప్రస్తుతం జిల్లాలో 2.89 లక్షల కుటుంబాలున్నట్లుగా పౌరసరఫరాలశాఖ ప్రకటించింది. మొత్తంగా 10,12,065 జనాభా ఉంది. ప్రస్తుతం జిల్లాలో 2.93లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లున్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నట్లుగా ఈ వివరాల ద్వారా అవగతమవుతున్నది. 2017-18లో 2.68 లక్షలు ఉన్న గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య ఏడాది వ్యవధిలోనే 25వేల కనెక్షన్లు పెరగడం విశేషం. ఫలితంగా కట్టెల పొయ్యిని వినియోగించే వారి సంఖ్య దాదాపు తగ్గుముఖం పట్టింది. 


ప్రభుత్వాసుపత్రులపై పెరిగిన విశ్వాసం

ప్రభుత్వాసుపత్రులకు వైద్య సేవల కోసం వెళ్లేవారి శాతం 60కి చేరినట్లు ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళితే ఎడాపెడా ఆపరేషన్లు చేయడం, పరీక్షలు, మందుల పేరిట జేబులు ఖాళీ చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌లో భారీ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించారు. అన్ని వసతులు కల్పించారు. మండలాల్లోనూ పీహెచ్‌సీలను పటిష్టం చేశారు. హుస్నాబాద్‌, చేర్యాల, దుబ్బాక ప్రాంతాల్లోనూ వైద్య సేవలను మెరుగుపరిచారు. ప్రభుత్వ వైద్యుల్లోనూ జవాబుదారీతనం వచ్చేలా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులను పక్కనబెట్టి ప్రభుత్వ వైద్యసేవలను వినియోగించుకునేవారి సంఖ్య పెరిగింది.


తలసరిలో 8వ స్థానం

జిల్లా జనాభాలో ఒక్కొక్కరి తలసరి ఆదాయం ఏటా రూ.1.70లక్షలు ఉన్నట్లు ఈ సర్వేలో పేర్కొన్నారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలకు అభివృద్ధి సూచికగానే నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే తలసరి ఆదాయంలో మన జిల్లా 8వ స్థానాన్ని దక్కించుకుంది. జిల్లా జనాభాలో సగం మంది వివిధ పనుల్లో నిమగ్నం కావడం, వ్యవసాయం, ఇతర వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలల్లో స్థిరపడిన కారణాల వల్ల తలసరి ఆదాయం పెరిగినట్లు అర్థమవుతున్నది. జిల్లాకు సంబంధించి ఏటా స్థూల ఆదాయం రూ.20,598 కోట్లు ఉన్నట్లు తేల్చారు. ఇందులోనూ రాష్ట్రంలో జిల్లా 9వ స్థానాన్ని దక్కించుకున్నది. 


సగం మంది పనిమంతులే

ఒకప్పుడు ఇళ్లలో కుటుంబ పెద్ద మాత్రమే పనిచేసేవాడు. మహిళలు అరుదుగా పనిలోకి వెళ్లేవారు. పల్లెటూళ్లలో మాత్రం కూలికి వెళ్లే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రతీ ఇంట్లో భార్యాభర్త ఏదో ఒక పనిచేయడం సాధారణ విషయంగా మారింది. తాజా సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం జిల్లాలో 10.12 లక్షల జనాభా ఉంటే ఇందులో 5.09 లక్షల మంది వివిధ పనులు చేస్తున్నారు. ఇందులో సుమారు 3లక్షల మంది వ్యవసాయాన్ని నమ్ముకొని పనిచేస్తున్నారు. రైతులుగా, రైతు కూలీలుగా ఉన్నారు. 40 వేల మంది చిరు వ్యాపారాలు, ఇళ్ల వద్ద చిన్న పరిశ్రమలతో కాలం వెళ్లదీస్తున్నారు. దాదాపు 1.40లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా పరిశీలిస్తే మన జిల్లా 14వ స్థానంలో ఉండడం గమనార్హం. 

Updated Date - 2020-03-13T10:36:52+05:30 IST