ప్రోత్సాహకమేదీ?

ABN , First Publish Date - 2020-03-04T10:33:21+05:30 IST

ప్రోత్సాహకమేదీ?

ప్రోత్సాహకమేదీ?

- గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి  ఏడాదైనా ఎదురుచూపులే

- జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలు 78


 సిద్దిపేట, మార్చి3: ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభు త్వం ప్రకటించిన ప్రోత్సాహకం అందని ద్రాక్షగా మారింది.  గ్రామాభివృద్ధికి గ్రామస్థులు, ఆశావహులు ఏకతాటి పైకి వచ్చి ఏకగ్రీవంగా పాలకవర్గాలను ఎన్నుకున్నారు. వీరిని ప్రోత్సహించడానికి రాష్ట్రప్రభుత్వం రూ.పది లక్షల నజరానా ప్రకటించింది. జిల్లాలో ఏకగ్రీవమైన 78 గ్రామ పంచాయ తీలు రూ.7.8 కోట్ల కోసం ఎదురుచూస్తున్నాయి. 


ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నో నిధులను ఖర్చు చేసింది. గ్రామపంచాయతీల ఎన్నికలు  ఏకగ్రీవమైతే ఎంతో ఖర్చు కలిసొస్తుందని భావించిన ప్రభు త్వం ఆ దిశగా ప్రోత్సహించింది. ఏకగ్రీవమైన చోట పోలిం గ్‌, బ్యాలెట్‌ పేపర్ల తయారీ, పోలింగ్‌ సిబ్బందిని నియమిం చడం మొదలైనవన్నీ తప్పుతాయి. ఈ నేపథ్యంలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. 2019 జనవరి, ఫిబ్రవరిలో మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలోని 499 గ్రామపంచాయతీలున్నాయి. అందు లో 78 గ్రామపంచాయతీలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. వీటికి రూ.పదిలక్షల చొప్పున రూ.7.8కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. 


వస్తాయన్న ఆశతో

 గ్రామాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 14వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర గ్రాంట్లను విడు దల చేస్తున్నాయి. వీటితో పాటు పంచాయతీ పరిధిలో వసూలయ్యే పన్నులు గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు. హరితహారం, డంపింగ్‌యార్డులు, శ్మశానవాటిక మొదలైనవి గ్రామీణ ఉపాధిహామీ నిధులతో చేపడుతున్నారు.  అయితే గ్రామాల సంపూర్ణాభివృద్ధికి ఈ నిధులు సరిపోవడం లేదు. గ్రామపంచాయతీల ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవం కావడానికి తంటాలు పడిన అభ్యర్థులు బరిలో నిలిచిన వారికి పలు హామీలు గుప్పించారు. తమకూ ఎన్నికల ఖర్చు కలిసొస్తుందని రకరకాల హామీలు ఇచ్చారు. వారు కోరిన వార్డుల్లో పనులు చేసి పెడతామని చెప్పారు. ప్రభుత్వపరంగా వచ్చే రూ.10లక్షల ప్రోత్సాహక నిధులు అందుకు వెచ్చిస్తామని చెప్పారు. ఇపుడు ఎన్నికలు ముగిసి ఏడాది దాటినా ప్రోత్సాహక సొమ్ము రాకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. 

Updated Date - 2020-03-04T10:33:21+05:30 IST