చెత్తను ఇంట్లో ఉంచుకున్నా జరిమానా!

ABN , First Publish Date - 2020-03-04T10:31:10+05:30 IST

చెత్తను ఇంట్లో ఉంచుకున్నా జరిమానా!

చెత్తను ఇంట్లో ఉంచుకున్నా జరిమానా!

-  ప్రతిరోజు చెత్త ట్రాక్టర్‌లో వేయాల్సిందే

- తడి,పొడి చెత్తను వేరు చేయాలి

- ఒక్క రోజు ట్రాక్టర్‌ రాకున్నా చైర్మన్‌, కౌన్సిలర్‌కు ఫైన్‌

- ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఉండాలి 

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

 

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి3: తాళం వేసి ఉంటే మినహా ప్రతి ఒక్క ఇంటి నుంచి చెత్తను సేకరించాలని, ఎవరైనా చెత్త వేయకుంటే జరిమానా విధించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. మున్సిపాలిటీ సిబ్బందికి చెత్తను ఇవ్వకుండా ఎక్కడపడితే పారేసే వాళ ్లపై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. పట్టణప్రగతిలో భాగంగా మంగళవారం 24వ వార్డులో మంత్రి పర్యటించా రు. అక్కడ నిర్మించిన సమీకృత మినీ మార్కెట్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేరు చేయాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పారు. ఒకవేళ అలా చేయకుంటే  జరిమానా తప్పదని హెచ్చరించారు. ప్రజలు కోరుకున్నట్లుగా ప్రతిరోజు చెత్త ట్రాక్టర్‌ రాకుంటే మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌, అధికారులకు కూడా జరిమానా వేయాల్సిందేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇల్లును ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటున్నారో గల్లీలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దోమలు లేని పట్టణంగా సిద్దిపేటకు కీర్తి దక్కాలని, ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని వివరించారు. నల్లా కనెక్షన్‌ లేని ఒక్క ఇల్లు కూడా ఈ పట్టణంలో ఉండకూడదని అలా జరిగితే తాను ఎమ్మెల్యేగా ఉండడమే వృథా అని అసహనం వ్యక్తం చేశారు. నీటి విభాగాన్ని పర్యవేక్షించే అధికారులను మందలించారు. పట్టణ ప్రజల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీలో పైరవీలు ఉండబోవని మంత్రి హరీశ్‌రావు మరోసారి స్పష్టం చేశారు. అర్హులైన వారికే ఇళ్లు దక్కుతాయని చెప్పుకొచ్చారు. 


మార్కెట్‌ నిర్మాణంపై అసంతృప్తి

24వ వార్డులో నిర్మించిన సమీకృత మినీ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా నిర్మించారని, ఒక మార్కెట్‌లా కాకుండా దుకాణం లా ఉన్నదని మండిపడ్డారు. ఇలా నిర్మిస్తుంటే అధికారు లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేశారని మందలించా రు. తాను మళ్లీ వచ్చేసరికి ఇందులో మార్పు రావాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, అడిషనల్‌ కలెక్టర్‌ ముజామ్మిల్‌ ఖాన్‌, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లిఖార్జున్‌,  గ్యాదరి రవీందర్‌, మోయిజ్‌, బూర శ్రీనివాస్‌, కాలనీ పెద్దలు మహిపాల్‌రెడ్డి, రాజిరెడ్డి ఉన్నారు.  

Updated Date - 2020-03-04T10:31:10+05:30 IST