ముండ్రాయి గ్రామైక్య సంఘానికి జాతీయస్థాయి గుర్తింపు

ABN , First Publish Date - 2020-03-04T10:30:12+05:30 IST

ముండ్రాయి గ్రామైక్య సంఘానికి జాతీయస్థాయి గుర్తింపు

ముండ్రాయి గ్రామైక్య సంఘానికి జాతీయస్థాయి గుర్తింపు

- 7న జాతీయ పురస్కారం అందుకోనున్న సంఘం


 నంగునూరు, మార్చి 3 : గ్రామాభివృద్ధికి కృషిచేసిన ముడ్రాయి గ్రామైక్య సంఘానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. 7న ఢిల్లీలో ఉత్తమ పురస్కారాన్ని అందుకోనుంది. గ్రామాభివృద్ధికి 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలంతా సంఘటితమై 30 స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడ్డారు. పంచ సూత్రాలను ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధిలో వాటిని అమలుపరుస్తూ పనిచేశారు. రూ.90 లక్షల 60 వేల కార్పస్‌ ఫండ్‌ను అంతర్గత అవసరాలకు వినియోగించుకోవడంతో సంఘం ఏ గ్రేడ్‌ గుర్తింపు పొందింది. రూ.కోటి 15 లక్షల బ్యాంకు లింకేజీతో 24 సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ల ద్వారా స్త్రీనిధి రుణాలు పొంది స్వయం ఉపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆదాయ వనరులను పెంపొందించుకున్నారు. గ్రామంలోని 60 కుటుంబాలకు పాడిపశువులను, 20 కుటుంబాలకు వ్యవసాయ రుణాలను, 70 గంగిరెద్దుల కుటుంబాలకు వ్యాపారాల నిమిత్తం బోళ్ల సామగ్రిని కొనుగోలు చేసి వారికి అందించడంతో వారు తక్కువ వడ్డీతో రుణాలు పొంది వ్యాపారాలు చేస్తూ అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తున్నారు. గ్రామైక్య సంఘంగా ఏర్పడిన ఈ సంఘం రూ.40 లక్షల 80 వేల కార్పస్‌ ఫండ్‌తో గ్రామైక్య సభ్యులంతా గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వచ్ఛ సుందర్‌, స్వచ్ఛ మరుగుదొడ్ల వాడకంలో గ్రామాన్ని ముందంజలో ఉంచారు. సభ్యుల వాటాగా ప్రతి సభ్యురాలి నుంచి ప్రతినెలా రూ.20 సేకరిస్తున్నారు. సభ్యులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.20 వేలను, సభ్యురాలి భర్త చనిపోతే రూ.10 వేలను అందిస్తూ వస్తున్నారు. ఇవేకాకుండా ఆరోగ్య అవసరాలకు ఈ సంఘం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామైక్య సంఘాన్ని గుర్తించిన ప్రభుత్వం పురస్కారానికి ఎంపిక చేసింది. మహిళల ఐక్యతతోనే జాతీయస్థాయి అవార్డు లభించిందని సర్పంచ్‌ బీ.కమలాకర్‌రెడ్డి అన్నారు. 

Updated Date - 2020-03-04T10:30:12+05:30 IST