దొంగలమఠం స్థానంలో విశ్వేశ్వరాలయం పనులకు శ్రీకారం

ABN , First Publish Date - 2020-12-07T06:04:39+05:30 IST

నారాయణఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేట పట్టణంలో వందల ఏళ్ల క్రితం నాటి దొంగలమఠాన్ని తొలగించి ఆ స్థానంలో నూతనంగా విశ్వేశ్వరాలయాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టారు.

దొంగలమఠం స్థానంలో విశ్వేశ్వరాలయం పనులకు శ్రీకారం
విశ్వేశ్వరాలయం పనులను ప్రారంభిస్తున్న బాధ్యులు

నారాయణఖేడ్‌, డిసెంబరు 6: నారాయణఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేట పట్టణంలో వందల ఏళ్ల క్రితం నాటి దొంగలమఠాన్ని తొలగించి ఆ స్థానంలో నూతనంగా విశ్వేశ్వరాలయాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. మఠం ఉన్న భూమి యజమాని బస్‌ లింగప్పస్వామి ఆధ్వర్యంలో పలువురు స్థానికులు శిథిలావస్థకు చేరిన మఠాన్ని తొలగించే పనులను ఆదివారం చేపట్టారు. పురోహితుడు మోహన్‌ జ్యోషి, పలువురు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందిరాన్ని భవ్యంగా నిర్మించి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించనున్నట్టు బస్‌ లింగప్పస్వామి తెలిపారు. ఏమైనప్పటికీ నూతన మందిర నిర్మాణ పనులను ప్రారంభించడంతో పురాతన మఠం కనుమరుగు కానున్నట్టు స్థానికులు చెబుతున్నారు.


దొంగలమఠం నేపథ్యం..

నారాయణఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేట పట్టణ శివార్లలోని వ్యవసాయ క్షేత్రాల్లో వందల ఏళ్ల క్రితం రాళ్లతో నిర్మించిన మఠానికి పూర్వం రాతి మఠం అని పిలిచేవారు. ఈ మఠం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండంతో దాన్ని దొంగలు తమ స్థావరంగా మార్చుకొని దొంగలించిన సొత్తును ఈ మఠంలో దాచుకునే వారని స్థానికులు చెప్పుకుంటారు. అందువల్లే  దానికి రాతి మఠం బదులుగా దొంగల మఠం  అని పిలుస్తారని పలువురు వయోవృద్ధులు వివరించారు. కాగా నాడు అటవీ ప్రాంతంలో నిర్మించిన మఠం, ప్రస్తుతం జనావాసాల మధ్యన ఉంది.  

 

Updated Date - 2020-12-07T06:04:39+05:30 IST