56 గ్రామాలకు మంజీరా నీరు

ABN , First Publish Date - 2020-12-16T05:21:09+05:30 IST

సంగారెడ్డి, కంది మండలాల్లోని 56 గ్రామాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మంజీరా నీరు అందిస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

56 గ్రామాలకు మంజీరా నీరు
సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇన్‌టెక్‌వెల్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఫిబ్రవరి 1 నుంచి కంది, సంగారెడ్డి మండలాల్లో  ఇంటింటికీ రెండు గంటల పాటు సరఫరా

మంజీరా నీటిని ఎవరు తరలించుకుపోయినా సహించేది లేదు

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి


సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 15  : సంగారెడ్డి, కంది మండలాల్లోని 56 గ్రామాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మంజీరా నీరు అందిస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో మంగళవారం ఇన్‌టెక్‌వెల్‌, ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగారెడ్డి నియోజవకవర్గంలోని కంది, సంగారెడ్డి మండలాల్లో ఉన్న 56 గ్రామాల ప్రజలకు ఇంటింటికీ మంజీరా తాగు నీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మెల్యేగా తాను 2013-14లో రూ.22 కోట్ల నిధులతో తాళ్లపల్లి గ్రామంలో ఇన్‌టెక్‌వెల్‌, ఫిల్టర్‌బెడ్‌ను నిర్మించామన్నారు. 2013-14లో ఫిల్టర్‌బెడ్‌ను పూర్తి చేశామని, కానీ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఓటమి పాలవడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫిల్టర్‌బెడ్‌ను ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిందని వాపోయారు. తిరిగి 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందాకే రివ్యూ చేసి ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తేది నుంచి రెండు గంటల పాటు కంది, సంగారెడ్డి మండలాల్లోని 56 గ్రామాల ప్రజలకు నీరందించాలని అధికారులను ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రజలకు మంజీర నీరు తాపకుండా మంత్రి హరీశ్‌రావు 15 టీఎంసీల నీటిని తరలించుకుపోయారని, కానీ ఈసారి మంజీరా నీటిని ఎవరు తరలించుకుపోయినా సహించేది లేదని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం మంజీరా రిజర్వాయర్‌ నుంచి ఒక్క నీటి చుక్కను కూడా ఇతర ప్రాంతాలకు తరలించకుండా అడ్డుకుంటానన్నారు. ఈ వర్సాకాలంలో కర్ణాటకలో వర్షాలు ఎక్కువగా పడడంతో ప్రకృతి దయవల్ల మంజీరా ప్రాజెక్టు నిండిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మిషన్‌ భగీరథ, తాగు నీటి సరఫరా, ఇరిగేషన్‌ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెల రోజుల్లోగా తాళ్లపల్లి ఇన్‌టెక్‌వెల్‌, ఫిల్టర్‌బెడ్‌లో పైప్‌లైన్‌, మోటార్లు ఇతర మరమ్మతు పనులను పూర్తి చేసి ట్రయల్‌రన్‌ నిర్వహించాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ డీఈ హరీశ్‌, ఏఈ రవికుమార్‌, ఇరిగేషన్‌ డీఈ బాలగణేష్‌, ఎంపీడీవో రవీందర్‌, ఎంపీవో మహేందర్‌రెడ్డి, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీపీ లావణ్యదుర్గే్‌షయాదవ్‌, కొత్లాపూర్‌ గ్రామ సర్పంచ్‌ సందీ్‌పరెడ్డి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ బక్క బలరాం, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, నాయకులు బుచ్చిరాములు తదితరులు ఉన్నారు.

Read more