మన అడవులకు మహర్దశ
ABN , First Publish Date - 2020-09-12T09:56:20+05:30 IST
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన జిన్నారం మండలంలోని అడవులకు మహర్దశ పట్టనుంది

అర్బన్ పార్కుల ఏర్పాటుతో అభివృద్ధి
నగర సమీపంలోని అడవుల రక్షణకు పటిష్ఠ చర్యలు
ఇప్పటికే నర్సాపూర్ రేంజ్ పరిధిలో ఫెన్సింగ్, ప్రహరీ నిర్మాణాలు పూర్తి
సోలార్ లైట్ల కోసం స్తంభాల ఏర్పాటు
కాజీపల్లి అర్బన్ ఫారెస్టును దత్తత తీసుకున్న ిహీరో ప్రభాస్
జిన్నారం, సెప్టెంబరు 11 : హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన జిన్నారం మండలంలోని అడవులకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే అటవీ ప్రాంతాలను అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. రాష్ట్ర రాజధానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాజీపల్లి అటవీ ప్రాంతం 1,650 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకుని ఉండే ప్రాంతం కావడంతో ప్రభుత్వం ఈ ప్రాంత అటవీ రక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టింది. నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతుండగా రాజధాని సమీప ప్రాంతంలోని అడవుల రక్షణ, అభివృద్ధి, అర్బన్ పార్కుల ఏర్పాటు కోసం ప్రముఖులకు దత్తత ఇవ్వాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాజీపల్లి అటవీ ప్రాంతం కొండలతో చిట్టడవిగా ఉండటంతో ఇక్కడ అభివృద్ధి చేపడితే పర్యాటక ప్రాంతంగా మారనున్నది.
అడవుల అభివృద్ధికి నిధుల కేటాయింపు
దశాబ్దాల తరబడి నరికివేత, ఆక్రమణలకు గురైన అడవుల సంరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల భారీ ఎత్తున నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా గతేడాది నర్సాపూర్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని జిన్నారం, బొంతపల్లి, రొయ్యపల్లి, మంగంపేట గ్రామాల శివారులోని అటవీ ప్రాంతం చుట్టూ పూర్తిగా ప్రహరీ నిర్మాణం, ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈ ఫెన్సింగ్‌లో 50 అడుగులకో సోలార్ లైటు ఉండేలా ఇటీవల స్తంభాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే 50 కిలోమీటర్ల చుట్టూ సోలార్ లైట్ల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇక వీరన్నగూడెం పరిధిలోని అటవీ ప్రాంతంలో ప్రస్తుతం అర్బన్ పార్కు పనులు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం నూతనంగా ఏర్పాటైన వావిలాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కాజీపల్లి అటవీ ప్రాంత అభివృద్ధికి తాజాగా చర్యలు చేపట్టారు. వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, ట్రీ పార్కు, ప్రత్యేక మొక్కల పెంపకం, వ్యూ పాయింట్‌తో పాటు ప్రస్తుతం ఉన్న వృక్షాలకు రక్షణ పనులు చేయనున్నారు.
ప్రభాస్ దత్తతతో అర్బన్ పార్క్ అభివృద్ధి
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షకుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా సినీ హీరో ప్రభాస్ గతంలో మొక్కలు నాటారు. కాజీపల్లి అటవీ ప్రాంతాన్ని అర్బన్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా ఎంపీ సంతో్‌షకుమార్ సూచనతో అర్బన్ పార్కు కోసం తన తండ్రి యూవీఎస్ రాజు పేరిట ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం అందజేశారు. అవసరమైతే మరిన్ని నిధులు అందజేస్తానని తెలిపారు.