స్వచ్ఛంద కట్టడి
ABN , First Publish Date - 2020-07-19T05:45:46+05:30 IST
మొన్న సదాశివపేట.. నిన్న జహీరాబాద్.. నేడు అందోలు-జోగిపేట.. రేపు సంగారెడ్డి.. ఇలా రోజుకో ...

కరోనా నియంత్రణకు బంద్ పాటింపు
వర్తక, వాణిజ్య, వాపార సముదాయాల మూసివేత
ఎక్కడికక్కడ వ్యాపార సంఘాల తీర్మానాలు
కరోనా కేసులు రోజురోజుకూ తీవ్రమవుతుండడం, ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోవడంతో అందరూ స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని భావిస్తున్నారు. వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాల వారు ఎక్కడికక్కడ సమావేశమై స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాలని తీర్మానించారు. అత్యవసరాలు మినహా ఇతర షాపులను మూసివేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట, సంగారెడ్డిలో పలు ప్రాంతాల్లో బంద్‌ను పాటిస్తుండగా మరికొన్ని ప్రాంతాలు అదే బాటలో నడవనున్నాయి.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూలై 18 : మొన్న సదాశివపేట.. నిన్న జహీరాబాద్.. నేడు అందోలు-జోగిపేట.. రేపు సంగారెడ్డి.. ఇలా రోజుకో పట్టణం కరోనా కట్టడికి స్వచ్ఛంద బంద్‌ను నిర్వహిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకు పెరుగుతుండడంతో ఆయా పట్టణాల్లోని వర్తక, వ్యాపార సంఘాలు సమావేశమై స్వచ్ఛంద బంద్‌ను పాటించాలని తీర్మానం చేశారు. ఎక్కడికక్కడ షాపులను మూసివేయాలని నిర్ణయించారు. లాక్‌డౌన్ ఎత్తివేసే నాటికి జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు సడలింపులు మొదలైన రెండు నెలల్లోనే 757కు చేరుకున్నాయి. అంతేగాక జిల్లావ్యాప్తంగా కరోనా సోకి 26 మంది మరణించారు. వారిలో సదాశివపేటలో ఒక వ్యాపారి కూడా ఉన్నారు. జిల్లాలోని వ్యాపారులకు కూడా ఇలా కరోనా సోకుతుండడంతో బెంబేలెత్తిన వర్తకులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు షాపులను మూసివేసేందుకు ఎక్కడికక్కడ పట్టణాల వారీగా నిర్ణయించుకుంటున్నారు.
వారం రోజుల పాటు బంద్
ఇప్పటికే సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల పరిధుల్లో వర్తక, వ్యాపార సంఘాల వారు బంద్‌ను అమలు చేస్తున్నారు. రెండు రోజుల ముందే ప్రకటించిన వ్యాపారులు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. సదాశిపేటలో గురువారం నుంచి బంద్‌ను నిర్వహిస్తుండగా జహీరాబాద్‌లో శుక్రవారం నుంచి పాటిస్తున్నారు. వారం రోజులు పాటు ఈ పట్టణాల్లో బంద్ కొనసాగనుంది. అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం రెండు గంటల వరకే వివిధ షాపులను తెరిచి ఉంచుతున్నారు. ఇక్కడి వ్యాపారులు ఈ నెల 20 నుంచి 26 వరకు పూర్తిగా మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు పూర్తిస్థాయిలో షాపులను మూసివేసి లాక్‌డౌన్ అమలు చేయాలని వర్తక, వ్యాపార సంఘాలు నిర్ణయించాయి. మహమ్మారి కరోనాను నియంత్రించడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోయినా పట్టణాల వారీగా వ్యాపార, వర్తక సంఘాలు నిర్ణయం తీసుకుని అమలు చేస్తుండడం మంచిదేనన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
సిద్దిపేట, దౌల్తాబాద్, మిరుదొడ్డిలో..
సిద్దిపేట పట్టణంలో గాంధీచౌరస్తా నుంచి లాల్‌కమాన్ వరకు ఈ నెల 19 నుంచి 31 తేదీ వరకు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేస్తున్నట్లు లాల్‌కమాన్ కమిటీ అధ్యక్షుడు ఎంఆర్ ప్రవీణ్ స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని పలు వ్యాపారుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక నాయకుడు బ్రహ్మంకు సంతకాల సేకరణ పత్రాన్ని ఆందజేశారు. కార్యక్రమంలో లాల్‌కమాన్ కమిటీ నాయకులు ధర్మవరం సతీష్, బచ్చు రమేష్, సాయిరాం క్రికెట్ యూత్ క్లబ్ కార్యదర్శి సద్ది మధుసూదన్‌రెడ్డి, సత్యంగౌడ్, నగేష్, బాల్‌రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఈ నెల 20 నుంచి 31 తేదీ వరకు సెలూన్ షాపులను సంపూర్ణంగా మూసివేస్తామని తీర్మానించుకున్నారు. సిద్దిపేట పట్టణ న్యూ నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు జంపాల రమేశ్, గౌరవ అధ్యక్షుడు మహేష్, కార్యవర్గం సమావేశమై విలేకరులతో మాట్లాడారు. 31 వరకు హెయిర్ షాపులు మూసి వేస్తున్నందున వినియోగదారులు సహకరించాలని కోరారు. దౌల్తాబాద్‌లో సర్పంచ్ అది వెంకన్న, హైమద్‌నగర్‌లో సర్పంచ్ షేక్ ఇమాంబి ఆధ్వర్యంలో వ్యాపార దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయించారు. శనివారం నుంచి 31 వరకు బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు షేక్‌పాషా, ఏఎంసీ డైరెక్టర్ గుష్మా, షేక్‌రఫీ, షేక్‌షబ్బీర్, ఖదీర్ పాల్గొన్నారు. మిరుదొడ్డిలో శనివారం నుంచి ఈ నెల 21 వరకు స్వచ్ఛంద బంద్‌ను పాటిస్తున్నట్లు సర్పంచ్ రాములు తెలిపారు.
దుబ్బాకలో 31 వరకు స్వచ్ఛంద బంద్
దుబ్బాక పట్టణంలో శనివారం నుంచి ఈ నెల 31 వరకు పట్టణంలో స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నట్లు వ్యాపారులు నిర్ణయించుకున్నారు. శనివారం దుకాణాదారులను ఒప్పించి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చింతరాజు, కూరవేణు, నల్లశ్రీనివాస్, సీబీ శ్రీనివాస్, చింత నాగేందర్, సత్యానందం అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. స్వచ్ఛంద బంద్‌తో దుబ్బాక నిర్మానుష్యంగా మారింది. శనివారం జరగాల్సిన వారాంతపు అంగడిని కూడా రద్దు చేశారు.