లాక్‌డౌన్‌.. బేఖాతర్‌

ABN , First Publish Date - 2020-03-24T06:36:12+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాపించకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలను జిల్లా ప్రజలు నీళ్లొదిలారు. ఆదివారం నాటి జనతా కర్ఫ్యూకు పూర్తిస్థాయిలో సహకరించిన...

లాక్‌డౌన్‌.. బేఖాతర్‌

  •  సూపర్‌ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లకు గుంపులుగా జనం
  •  రేపటి ఉగాది కోసం హడావిడి
  •  కేంద్ర ప్రభుత్వ సంస్థల మూసివేత
  •  ముంబయి బస్సుకు ఒకచోట నో ఎంట్రీ, మరోచోట ఎంట్రీ
  •  చర్చనీయాంశమైన పోలీసుల తీరు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి) : కరోనా వైరస్‌ వ్యాపించకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలను జిల్లా ప్రజలు నీళ్లొదిలారు. ఆదివారం నాటి జనతా కర్ఫ్యూకు పూర్తిస్థాయిలో సహకరించిన ప్రజలు సోమవారం నుంచి అదేస్థాయిలో సహకరించాలన్న ప్రభుత్వ విన్నపాన్ని పట్టించుకోలేదు. బుధవారం ఉగాది పండుగ ఉండడంతో తెల్లారితే పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో ప్రజలు సోమవారం మార్కెట్లకు వచ్చారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు అన్నిప్రాంతాల్లోని సూపర్‌, కూరగాయల మార్కెట్లు, ఇతర కిరాణా దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. అన్ని దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగుంపులుగా ఉండడం కనిపించింది. అయితే వారిలో చాలామంది మాస్క్‌లు, కర్చి్‌ఫలను ముఖాలకు కట్టుకుని ఉండడం కొంత వరకు నమయే అనిపించింది. 


కేంద్ర ప్రభుత్వ సంస్థల మూత

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, ఇక్రిశాట్‌ మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ముగిసే వరకూ మూసేసినట్లు యాజమాన్యాలు సిబ్బందికి సమాచారం ఇచ్చాయి. అలాగే ప్రైవేట్‌ రంగంలోని ఇంజనీరింగ్‌, ప్లాస్టిక్‌, టెక్స్‌టైల్‌ వంటి పరిశ్రమలను కూడా మూసేశారు. పాషమైలారం పారిశ్రామికవాడలోని కొన్ని ఇంజనీరింగ్‌ పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్‌ చేస్తూ నడిపించాయి. ప్రభుత్వం అనుమతించిన బల్క్‌డ్రగ్‌, ఆగ్రో అథారిటీ పరిశ్రమలు యధావిధిగా పనిచేశాయి. 


అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత

జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దులన్నింటినీ పోలీసులు మూసేశారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన మొగుడంపల్లి మండలం చిరాగ్‌పల్లి, నాగిలిగిద్ద మండలం కర్‌సగుత్తి, మోర్గి, కంగ్టి మండలం దేగుల్‌వాడి, కల్హేర్‌ మండలం మాసాన్‌పల్లి ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 


ఆటోలు ఫుల్‌ 

ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలు రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వం హెచ్చరించినా ఆటోడ్రైవర్లు పట్టించుకోలేదు. పట్టణాల్లోకి రాకపోయినా బారికెడ్ల బయట ఉండి, అక్కడి నుంచి ఫసల్‌వాది, ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు ప్రయాణికులను తీసుకెళ్లారు. జాతీయ రహదారిపై ఉన్న ఇస్నాపూర్‌ వద్ద ఆటోలు యథేచ్ఛగా నడిచాయి. 


ముంబయి బస్సుకు చిరాగ్‌పల్లి వద్ద నో ఎంట్రీ, కర్‌సగుత్తి వద్ద ఎంట్రీ

కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందినవారు ముంబయి నుంచి ట్రావెల్స్‌ బస్సులో కాగా.. వారిని ఒక సరిహద్దు ప్రాంతంలో ఆపిన సంగారెడ్డి పోలీసులు మరో సరిహద్దు గుండా పంపించడం చర్చనీయాంశమైంది. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన 36 మంది దుబాయి నుంచి ముంబయి చేరుకుని అక్కడి నుంచి ట్రావెల్‌ బస్సులో సోమవారం ఉదయం జహీరాబాద్‌ సమీపంలోని చిరాగ్‌పల్లి వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని బస్సు దిగనీయకుండా తమ రాష్ట్రంలోకి అనుమతి లేదంటూ వెనక్కి పంపారు. దాంతో వారందరూ అదే బస్సులో మరోదారి మీదుగా బీదర్‌ వెళ్లి అక్కడి నుంచి నాగలిగిద్ద మండలం కర్‌సగుత్తి చెక్‌పోస్టు వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న పోలీసులు వారి బస్సుకు ఎస్కార్ట్‌ ఇచ్చి, కామారెడ్డి జిల్లా పిట్లంకు పంపించారు. అక్కడి పోలీసులు అనుమతిస్తే అందరూ తమతమ జిల్లాలకు వెళ్లనున్నారు. 


Updated Date - 2020-03-24T06:36:12+05:30 IST