రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2020-06-06T10:07:06+05:30 IST

లబ్ధిదారులకు రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి బ్యాంకర్‌లకు

రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలి

సబ్సిడీ రుణాల్లో జాప్యం చేయొద్దు

బ్యాంకర్లతో సమావేశంలో మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి


మెదక్‌ రూరల్‌, జూన్‌ 5: లబ్ధిదారులకు రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి బ్యాంకర్‌లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీసీసీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌-19తో పరిశ్రమలకు చాలా నష్టాలు వచ్చాయని, వారికి నిధులు, రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఆత్మనిర్బర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ కింద రుణాలను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించిందని వివరించారు.


అందుకు రూ.3 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను అక్టోబర్‌ వరకు మంజూరు చేయాలన్నారు. రైతులకు సంబంధించిన వ్యవసాయ రుణాలను రెన్యూవల్‌ చేయడంలో వేగం పెంచాలన్నారు. ప్రతి బ్యాంకుకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా రుణాల పంపిణీ పూర్తి చేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం రూ.25 వేల రుణమాఫీ చేసినందున బ్యాంకర్లు ఎలాంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు.


కూరగాయలు, పూల మొక్క సాగుకు, పండ్ల తోటల నిర్వహణకు రుణాల మంజూరును వీలైంనత త్వరగా పూర్తి చేయాలన్నారు. నిరుద్యోగ యువత ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందిస్తున్నదని తెలిపారు. సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ రామకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరుశురాం నాయక్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ కృష్ణమూర్తి, పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T10:07:06+05:30 IST