ప్రమాదమని తెలిసినా ‘తెప్ప’ని సాహసం
ABN , First Publish Date - 2020-12-19T05:53:00+05:30 IST
సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నిలిచిన ప్రాంతాల్లో రైతులు పొలాలకు వెళ్లేందుకు రోజూ సాహసం చేయల్సి వస్తున్నది.

సింగూరు బ్యాక్ వాటర్ అవతల పొలాలను చేరుకునేందుకు అన్నదాతల సాహసం
రూ.3.15 కోట్ల నిధులు మూలుగుతున్నా వంతెన నిర్మాణంలో తీవ్ర జాప్యం
సంగారెడ్డి టౌన్, డిసెంబరు 18: సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నిలిచిన ప్రాంతాల్లో రైతులు పొలాలకు వెళ్లేందుకు రోజూ సాహసం చేయల్సి వస్తున్నది. ఏటికి ఆవతల ఉన్న పంటచేలను చేరుకునేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని థర్మాకోల్ తెప్పలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3.15 కోట్ల నిధులు రెండేళ్లుగా మూలుగుతున్నాయి.
వాగు అవతల 500 ఎకరాల భూమి
రాయికోడ్ మండల పరిధిలోని పీపడ్‌పల్లి గ్రామ శివారులో ఉన్న వాగు అవతల ఒడ్డున గ్రామస్థులకు చెందిన 500 ఎకరాల భూమి ఉంది. పక్కనే సింగూరు ప్రాజెక్టు ఉండడంతో బ్యాక్‌వాటర్ వాగులో నిండుగా నిలిచి ఉంటాయి. అవతల ఒడ్డున వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకోవడానికి రైతులు థర్మాకోల్‌తో తయారు చేసుకున్న నాటు తెప్పలపై వెళ్తుంటారు. ప్రతీరోజు ఉదయం వాగును దాటి అవలతల ఒడ్డుకు చేరుకుంటారు. పనులు ముగించుకుని సాయంత్రం మళ్లీ వాగును దాటి గ్రామానికి వస్తుంటారు. ఇటీవల భారీ వర్షాలు కురిసిన సమయంలో సింగూరు బ్యాక్‌వాటర్ పోటెత్తడంతో వాగు పూర్తిగా మునిగిపోయింది. అవతల ఒడ్డున పంటలు ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి నెలకొన్నది.
వంతెన నిర్మాణ పనులకు గ్రహణం
పిపడ్‌పల్లి శివారులోని వాగుపై వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం ప్రభుత్వం రూ.3.15 కోట్లు మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మొదట్లో ఆర్భాటంగా పనులను ప్రారంభించినా పిల్లర్ల స్థాయికి రాగానే పనులను నిలిపివేశారు. రెండేళ్లు దాటినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వంతెన నిర్మాణానికి వేసిన శిలాఫలకం వెక్కిరిస్తున్నది. ఈ వంతెన పూర్తయితే మండల పరిధిలోని 12 గ్రామాల ప్రజలకు మేలు జరిగుతుంది. పీపడ్‌పల్లి, కడ్చల్, ఇందూర్, మామిడిపల్లి, మొరట్గా, రాయిపల్లి, నాగన్‌పల్లి, బొబ్బిలంపల్లి తదితర గ్రామాల నుంచి నారాయణఖేడ్, మెదక్, నిజామాబాద్ వెళ్లడానికి 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.