స్టీల్ సిద్దిపేటగా మార్చుకుందాం
ABN , First Publish Date - 2020-06-22T11:43:59+05:30 IST
పట్టణంలోని అన్నివార్డుల్లో స్టీల్ బ్యాంకులు ప్రారంభించుకుని ‘‘స్టీల్ సిద్దిపేట’’గా మార్చుకుందామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం

జూలై మొదటివారంలో అన్నీ వార్డుల్లో స్టీల్ బ్యాంకులు ప్రారంభం
టెలీకాన్ఫరెన్స్‌లో మున్సిపల్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట టౌన్, జూన్21: పట్టణంలోని అన్నివార్డుల్లో స్టీల్ బ్యాంకులు ప్రారంభించుకుని ‘‘స్టీల్ సిద్దిపేట’’గా మార్చుకుందామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మున్సిపల్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వాడకం పెరిగిందని, వాటిని తగ్గించాలంటే ప్రజలకు ప్రత్యామ్నాయం ఇవ్వాలన్నారు. ఆ ప్రత్యామ్నాయమే మున్సిపాలిటీలో స్టీల్ బ్యాంకని, ప్రతీ వార్డులో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌రహితంగా చేద్దామన్నారు. ప్రతి స్టీల్ బ్యాంకు ద్వారా 700 మంది భోజనం చేసే విధంగా అన్నిరకాల స్టీల్ సామాను, ప్లేట్లు గ్లాసులు, గిన్నెలు, డిషెస్ ఇతరత్రా వంట సామాగ్రి అందించనున్నట్లు వివరించారు. మున్సిపల్‌పరిధిలోని 34వార్డులుండగా 5వార్డుల్లో స్టీల్ బ్యాంకు ప్రారంభించుకున్నామని చెప్పారు.
మిగతా 29వార్డుల్లో స్టీల్ బ్యాంకు ఏర్పాటుకు కావాల్సిన మెటీరియల్ చేరుకున్నదని, ప్రతీ వార్డులో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేయనున్న అనువైన ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్పీలు పరిశీలించాలన్నారు. జూలై మొదటివారంలో 29వార్డుల్లో స్టీల్ బ్యాంకులు ప్రారంభించేలా సన్నాహాలు చేయాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్, నిర్వాహకులను ఆదేశించారు. ఈనెల 25న ప్రారంభంకానున్న హారితహారంలో భాగంగా మున్సిపల్ పరిధిలో 2లక్షల పైచిలుకు లక్ష్యం ఉన్నందున పకడ్భందీగా ప్రణాళికలు రూపొందించి హరితహారం కార్యక్రమం చేపట్టాలని సూచించారు. మున్సిపల్ వాహనంలో చెత్తవేయని వారిపై, బయట పడేసే వారికి జరిమానా వేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో మున్సిపల్ మెప్మా ఆర్పీలు, శాంతి, బాలవికాస సంస్థ ప్రతినిధి శౌరీరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.