దుకాణాల కేటాయింపుపై ఆందోళన
ABN , First Publish Date - 2020-12-29T06:02:03+05:30 IST
బస్టాండ్ సమీపంలో అత్యంత విలువైన రెండు దుకాణాలను బహిరంగ వేలం వేయకుండా అక్రమ దారిలో కేటాయించడంపై యువజన సంఘాల నాయకులు సోమవారం మెదక్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట యువజన సంఘాల బైఠాయింపు
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబరు 28 : బస్టాండ్ సమీపంలో అత్యంత విలువైన రెండు దుకాణాలను బహిరంగ వేలం వేయకుండా అక్రమ దారిలో కేటాయించడంపై యువజన సంఘాల నాయకులు సోమవారం మెదక్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న దళితులకు గానీ, నిరుద్యోగులకు గానీ అవకాశం కల్పించకుండా ఓ పార్టీ నేతకు దుకాణాలను కేటాయించడంపై మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు ప్రతిపాదన కలెక్టర్ గారికి పంపడంతోనే ఆయన ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. దుకాణం కేటాయించిన వ్యక్తికి సంబంధించిన వివరాలు కలెక్టర్‌కు ఎలా తెలుస్తాయని మున్సిపల్ అధికారుల అక్రమాలతోనే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు కేటాయించాల్సిన దుకాణాలను ఓ ప్రజాప్రతినిధి అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి డీఈ మహే్‌ష ఫోన్ ద్వారా యువజన సంఘాల నాయకులతో మాట్లాడి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమాల్లో దళిత, యువజన సంఘాల నాయకులు రామస్వామి, బీముడు, బాలరాజు, భరత్‌గౌడ్, అమీర్, మన్సూర్‌అహ్మద్, సుశీల్, జక్కుల శేఖర్, జక్కుల రాజు, గుండు తదితరులు పాల్గొన్నారు.