ధరణితో పారదర్శకంగా భూముల రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-11-07T10:12:01+05:30 IST

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, వివాదాలు తలెత్తకుండా పారదర్శకంగా ఉండేలా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం ఓఎస్డీ రామయ్య తెలిపారు

ధరణితో పారదర్శకంగా భూముల రిజిస్ట్రేషన్లు

ప్రాథమిక సమస్యలను అధిగమించేందుకు కృషి

సీఎం ఓఎస్డీ రామయ్య


పటాన్‌చెరు, నవంబరు 6 : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, వివాదాలు తలెత్తకుండా పారదర్శకంగా ఉండేలా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం ఓఎస్డీ రామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన పటాన్‌చెరు తహసీల్దార్‌ కార్యాలయంలో పోర్టల్‌ అమలవుతున్న తీరుపై అడిషనల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో నగేష్‌, తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డితో సమీక్షించారు. రిజిస్ట్రేషన్ల అమలులో ఎదురువుతన్న సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో నమోదు కాని భూముల రిజిస్ట్రేషన్‌, ఫౌతీ మార్పిడి పెండింగ్‌ దరఖాస్తులు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. అనేక సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ వివాదాలకు చరమగీతం పాడేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.


భవిష్యత్తులో సివిల్‌ తగాదాలు ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో ఉన్న లోపాలను సవరించి ఆధునిక పద్ధతుల్లో ధరణి పోర్టల్‌కు రూపకల్పన చేశామని తెలిపారు. కొన్ని సమస్యలు తలెత్తుతున్నా వాటిని త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా ఐటీని ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. స్లాట్‌లు బుక్‌ చేసుకున్న రోజే రిజిస్ట్రేషన్లు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్‌లో అక్రమాలు చోటు చేసుకుంటే తహసీల్దార్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2020-11-07T10:12:01+05:30 IST