ఉపాధికి ఊపు
ABN , First Publish Date - 2020-05-09T09:53:53+05:30 IST
కరోనా వేళ ఉపాధి పనులు ఊపందుకుంటున్నాయి. లాక్‌డౌన్ అమలులో ఉన్నా గతంలో కంటే ఎక్కువ
సిద్దిపేట జిల్లాలో పనుల్లో పాల్గొంటున్న లక్షా 24 వేల మంది
మెదక్ జిల్లాలో పనికి వెళ్తున్న లక్ష మంది
పని చేసేందుకు ముందుకు వస్తున్న విద్యావంతులు, యువకులు, డ్రైవర్లు
సిద్దిపేట సిటీ/మెదక్ రూరల్, మే 8: కరోనా వేళ ఉపాధి పనులు ఊపందుకుంటున్నాయి. లాక్‌డౌన్ అమలులో ఉన్నా గతంలో కంటే ఎక్కువ మంది కూలీలు పనికి వస్తున్నారు. మరోపక్క కొత్తగా పేర్లు నమోదు చేసుకుంటున్నవారు కూడా పెరిగారు. విద్యావంతులు, యువకులు, డ్రైవర్లు ఉపాధి పనికి పోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి భౌతికదూరం పాటిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో గతేడాది నూరు శాతం ఉపాధి కూలీలకు పని దినాములు కల్పించి జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది లాక్‌డౌన్ అమలులో ఉన్నా అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వస్తున్నది.
పుంజుకున్న ఉపాధి పనులు
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 499 గ్రామపంచాయతీల్లో 1.36,597 జాబ్‌కార్డులున్నాయి. ప్రతీరోజు లక్ష 24వేల మంది ఉపాధి పనులకు హాజరు కావడం విశేషం. మరో నెలరోజులు ఇదే స్థాయిలో పనులు జరిగితే జిల్లా జాతీయస్థాయిలో మొదటిస్థానంలో నిలపడం ఖాయమని అఽధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఉపాధి పనుల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపాఽధిహామీలో కీలక పాత్ర పోషించే ఫీల్డ్ అసిస్టెంట్‌లు సస్పెండ్ అయిన తరుణంలో, ప్రత్యామ్నాయంగా ఉపాధిహామీ పనులను పంచాయితీ కార్యదార్శులకు అప్పగించారు. వారికి ప్రతీవారం శిక్షణ ఇస్తున్నారు.
పెరిగిన జాబ్‌కార్డులు
సిద్దిపేట జిల్లాలో ప్రైవేటు రంగంలో పనిచేసే విద్యావంతులు, యువత, డ్రైవర్లు కరోనా ఎఫెక్టుతో ఉపాధిహామీ పనులు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 15 రోజుల్లోనే కొత్తగా 2 వేల మంది జాబ్‌కార్డు తీసుకుని ఉపాధి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతీరోజు 1.24 లక్షల మంది పనుల్లో పాల్గొంటున్నారు. గతంలో అత్యధికంగా ఒకరోజు 70 వేల మంది పని చేశారు.
మంత్రి చొరవతో పెరిగిన ఆదరణ
లాక్‌డౌన్ ఉపాధి కోల్పోయినవారికి ఉపాధి హామీ ద్వారా పని కల్పించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జాబ్‌కార్డుకు ధరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేయాలని సూచించారు. మంత్రి చొరవతో ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, డ్రైవర్లు జాబ్‌కార్డులు తీసుకుని పనులు చేస్తున్నారు. మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. జిల్లాను నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి చేయడానికి కృషి చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో లక్ష దాటిన ఉపాధి కూలీలు
మెదక్ జిల్లాలో రకార్డుస్థాయిలో ఒకేరోజు లక్షా 5వేల మంది ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో 1,67,711 జాబ్‌కార్డులు, 3,80,327 మంది కూలీలున్నారు. గతంలో ఒకరోజు అత్యధికంగా 60 వేల మంది పనిచేశారు. గతవారం 65 వేల మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. వారం రోజుల్లోనే ఇది అమాంతం పెరిగి లక్ష దాటిపోయింది. లాక్‌డౌన్‌తో వేరే పనులు లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు స్వస్థలాలకు తిరిగిరావడంతో పనికి వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నది. గతంలో ఉపాధి పనుల్లో మెదక్ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా 7వ స్థానంలో, జనాభా సగటుతో పోల్చుకుంటే పని కల్పించడంలో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో మూడు వారాలుగా ఉపాధిహామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలవ్యాప్తంగా 11 వేల జాబ్‌కార్డులు, 14 వేల మంది కూలీలున్నారు. 8వేల మంది పనులు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు మరింతమందికి పని కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పనులు జరుగుతున్న ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.