ఉద్యమ ద్రోహులకే కేసీఆర్ అధిక ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-12-28T04:54:43+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి విలువ ఇవ్వకుండా ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికే సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని మాజీ శాసనమండలి చైర్మన్, బీజేపీ నేత స్వామిగౌడ్ విమర్శించారు.

అపాయింట్‌మెంటు అడిగినా రెండు నిమిషాలు సమయం ఇవ్వని ముఖ్యమంత్రి
బీజేపీ నేత స్వామిగౌడ్ ధ్వజం
నర్సాపూర్, డిసెంబరు 27: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి విలువ ఇవ్వకుండా ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికే సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని మాజీ శాసనమండలి చైర్మన్, బీజేపీ నేత స్వామిగౌడ్ విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ వచ్చిన సందర్భంగా స్థానిక బీజేపీ కౌన్సిలర్ సునీతాబాల్‌రెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన తనకే ముఖ్యమంత్రి రెండేళ్లుగా రెండు నిమిషాలు సమయం ఇవ్వాలేదని, ఇక సామాన్య ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీ అవుతాయని వాటిని ప్రభుత్వం ఏర్పడగానే భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చి ఆరేళ్లైన నేటి వరకు 30 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు గుణపాఠం రావడంతో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన చేశారని తెలిపారు. టీఎ్‌సపీఎ్‌ససి ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఆయా శాఖల ద్వారానే భర్తీ చేయాలనే కుట్ర చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రం అంతా తన సొంత జాగీరు అన్న విధంగా వ్యవహరిస్తుందన్నారు. టీఆర్‌ఎ్‌సలో విలువ లేకపోవడంతోనే జాతీయ పార్టీ బీజేపీలో చేరానని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్.గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, కౌన్సిలర్ సునీతాబాల్‌రెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొల్చారంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయాన్ని స్వామిగౌడ్ దర్శించుకున్నారు. రేణుకామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.