పరిహారం ఇవ్వలేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి
ABN , First Publish Date - 2020-12-11T06:21:09+05:30 IST
సిద్దిపేట నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కోసం తన 25 గుంటల భూమిని తీసుకొని పరిహారం ఇవ్వలేదంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.
25 గుంటల భూమిని డబుల్ ఇళ్లకు కేటాయించి న్యాయం చేయలేదని ఆత్మహత్యాయత్నం
సిద్దిపేట సిటీ, డిసెంబరు 10: సిద్దిపేట నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కోసం తన 25 గుంటల భూమిని తీసుకొని పరిహారం ఇవ్వలేదంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. గురువారం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ డబుల్ బెడ్రూం కాలనీలో సీఎం కేసీఆర్ ఇళ్లను ప్రారంభించి వెళ్లిపోగానే ఈ కాలనీ వద్దే నివాసం ఉంటున్న శ్రీనివాస్ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకే యత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు శ్రీనివాస్‌ను అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు వాటర్‌ట్యాంక్‌పైనే ఉండి తనకు న్యాయం చేయాలంటూ అరిచాడు. పోలీసులు ఎంత సర్దిచెప్పిన కిందికి దిగలేదు. అసహనానికి గురైన పోలీసులు సదురు వ్యక్తిని బలవంతంగా కిందకి దింపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగేళ్ల కింద తన 25 గుంటల భూమిని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్నారని, నష్టపరిహారం ఇస్తామని చెప్పి తనను పక్కన పెట్టారని విలపించాడు. కనీసం డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదని వాపోయాడు. పరిహారం ఇవ్వక, ఇల్లు ఇవ్వక అధికారులు అన్యాయం చేశారంటూ బోరుమన్నాడు.