ఈ పనులకు రెండేళ్లు!

ABN , First Publish Date - 2020-12-05T05:53:01+05:30 IST

దుబ్బాకలోని ఐటీఐ కళాశాల (పారిశ్రామిక శిక్షణ కేంద్రం కళాశాల) సొంత భవనం నిర్మాణం రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నది.

ఈ పనులకు రెండేళ్లు!
దుబ్బాకలో నత్తనడకన సాగుతున్న ఐటీఐ కళాశాల భవన నిర్మాణ పనులు

 కొనసాగుతూనే ఉన్న దుబ్బాక ఐటీఐ కళాశాల నిర్మాణం

 నిధుల కొరతతో ఆగిన భవన నిర్మాణ పనులు

 బిల్లులు రాలేవని చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌


దుబ్బాక, డిసెంబరు3: దుబ్బాకలోని ఐటీఐ కళాశాల (పారిశ్రామిక శిక్షణ కేంద్రం కళాశాల) సొంత భవనం నిర్మాణం రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నది. బిల్లులు రాకుంటే పనులు ఎలా చేయాలంటూ కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేశారు. 2018లో దుబ్బాకలో రూ.5కోట్లతో ఐటీఐ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌శాఖ కార్మిక ఉపాధిశాఖ నిధులతో 2018జూన్‌ 6న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అయితే డిజైన్‌ను అధికారులు సకాలంలో అందించలేదనే సాకుతో సుమారు 6నెలలు కాలయాపన చేసి, పనులను మొదలు పెట్టారు. ఎన్నికల ముందు హడావుడి చేసిన అధికారులు స్లాబ్‌ లేవల్‌లో పనులు చేపట్టి వదిలేశారు. సుమారు రూ.70 లక్షల వరకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు ఇప్పటి వరకు అధికారులు రికార్డు చేయకపోవడంతో బిల్లులు ఆగిపోయినట్లు తెలిసింది. ప్రభుత్వం నిధులను విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల బిల్లులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. 

2010లో దుబ్బాకలో ఐటీఐ కళాశాలను అప్పటి ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మంజూరీ చేయించారు. అయితే పదేళ్లుగా ఐటీఐ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో ఐకేపీ భవనంలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు విద్యార్థులకు వివిధ వృత్తివిద్యా శిక్షణకు అనువైన సౌకర్యాలు లేకపోవడంతో తాత్కాలికంగా కొన్ని కోర్సులను ప్రభుత్వం ఎత్తేసింది. సొంత భవనానికి 2012లోనే రూ.2కోట్లా నిధులు మంజూరు కాగా, స్థల సేకరణలో జాప్యం మూలంగా నిధులు అలాగే మిగిలిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన నిధులు సకాలంలో వినియోగించకపోవడంతో తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిధులు రద్దయ్యాయి. 2018లో రూ.5కోట్ల నిధులను మంజూరు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు పనులు ప్రారంభిస్తుందని ఆశిం చినా కూడా అధికారుల నిర్లక్ష్యం మూలంగా రెండేళ్లుగా పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. కరోనా మూలంగా విద్యాసంవత్సరం తరగతులు కొనసాగకపోయినప్పటికీ, రెండు నెలల్లో విద్యాసంవత్సరం ప్రారంభించనున్నట్టు ప్రచారం సాగడంతో ఐటీఐ కళాశాల పనులు ఎప్పుడు పూర్తవుతాయనే అంతా ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2020-12-05T05:53:01+05:30 IST