లక్ష్మాపూర్‌లో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-04-14T12:11:31+05:30 IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన లక్ష్మాపూర్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

లక్ష్మాపూర్‌లో ఉద్రిక్తత

అధికారులను అడ్డుకున్న మల్లన్నసాగర్‌ ముంపు గ్రామస్థులు

పునరావాసం కల్పిస్తేనే ఇళ్లు ఖాళీ చేస్తామని స్పష్టం

లాక్‌డౌన్‌ ముగిసే వరకు అధికారులు   గ్రామంలోకి వస్తే ఊరుకోబోమని హెచ్చరిక


తొగుట, ఏప్రిల్‌ 13 : సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన లక్ష్మాపూర్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాన్ని ఖాళీ చేయించడానికి తొగుట తహసీల్దార్‌ బాల్‌రెడ్డి నేతృత్వంలో అధికారులు గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్థులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో అధికారులు తమ గ్రామానికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించకుండా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించి కూల్చివేయించడం ఏంటని మండిపడ్డారు.


గజ్వేల్‌ మండలం సంగాపూర్‌ శివారులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇంకా పునాది దశలోనే ఉన్నాయని, ఫ్లాట్లను ఇంకా  ఎందుకు సిద్ధం చేయలేదని అధికారులను నిలదీశారు. ప్రజలను మోసం చేసే ప్రయత్నంలోని భాగమే గ్రామాన్ని ఖాళీ చేయించడమని ఆరోపించారు. నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పి నేడు నట్టేట ముంచాలని చూడడం దుర్మార్గమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు వృద్ధులకు ప్యాకేజీ ఇవ్వలేదని వారు ఎలా బతుకుతారని అధికారులను ప్రశ్నించారు. వృద్ధుల భూములు కావాలి కానీ వారి సమస్యలను మాత్రం పట్టించుకోరా అని మండిపడ్డారు. సంగాపూర్‌లో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో  కరెంటు, నీటి సరఫరా కూడా లేదన్నారు. నిర్వాసితుల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ గడువు ముగిసే వరకు గ్రామానికి ఎవరూ రావొద్దని గ్రామస్థులు తేల్చిచెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. 


శాశ్వత పునరావాసం కల్పించాకే తరలించాలి : సీఐటీయూ

లక్ష్మాపూర్‌ గ్రామంలో మల్లన్నసాగర్‌ ముంపు బాధితుల ఇళ్లను అధికారులు తాత్కాలిక పునరావాసాలకు తరలించే ప్రక్రియను ఆపేయాలని, శాశ్వత పునరావాసం కల్పించిన తర్వాతనే తరలించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బండ్లస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ పునరావాస కేంద్రాల నిర్మాణంపై లేదని ఆయన మండిపడ్డారు. ముంపు గ్రామాల్లోని ప్రజలందరికీ రావాల్సిన పునరావాస ప్యాకేజీలు రాకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మరోసారి పున:పరిశీలన చేసుకోవాలని సూచించారు. లేదంటే గ్రామస్థులకు న్యాయం జరిగే వరకు పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-04-14T12:11:31+05:30 IST