సరి లేదు.. బేసి లేదు!
ABN , First Publish Date - 2020-05-13T05:56:11+05:30 IST
లాక్‌డౌన్ విధించిన 50 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారులకు కొన్ని నియమనిబంధనలు విధిస్తూ దుకాణాలను తెరుచుకునేందుకు

సంగారెడ్డి రూరల్ : లాక్‌డౌన్ విధించిన 50 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారులకు కొన్ని నియమనిబంధనలు విధిస్తూ దుకాణాలను తెరుచుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజశ్రీ షా వ్యాపారులు సరి, బేసి సంఖ్యల ఆధారంగా రోజు విడిచి రోజు దుకాణాలను తెరుచుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 8 మున్సిపాలిటీల్లో 2, 4, 6, 8, 10, 12, 14 నంబర్ ఉన్న షాపులు సరి తేదీల్లో, 1, 3, 5, 7, 9, 11, 13, 15 తదితర నంబర్ కలిగిన షాపులు బేసి తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు.
దుకాణ యాజమాన్యాలు, వినియోగదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. సరి, బేసి ఆధారంగా కాకుండా వారి ఇష్టానుసారంగా దుకాణాలు తెరుస్తున్నారు. మాస్కులు ధరించకున్నా, భౌతిక దూరం పాటించకున్నా మున్సిపల్ అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం వాహనదారులకు జరిమానాలు విధిస్తూ సరిపెట్టుకుంటున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.