మాస్టర్ ప్లాన్‌కు మోక్షమెన్నడో?
ABN , First Publish Date - 2020-12-17T06:08:50+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సంగారెడ్డి పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది.

60 అడుగుల రోడ్డుపై అక్రమ నిర్మాణాలు
సంగారెడ్డి కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే బేఖాతర్
హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడమే శాపమా?
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
సంగారెడ్డి టౌన్, డిసెంబరు 16: గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సంగారెడ్డి పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న పట్టణం కొన్నేళ్లుగా విస్తరిస్తున్నది. రెండేళ్ల క్రితం 31 వార్డులతో ఉన్న సంగారెడ్డిలో శివారు గ్రామాలైన పోతిరెడ్డిపల్లి, చింతల్‌పల్లి గ్రామాలతో పాటు కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని కొంత ప్రాంతం విలీనమై 25 కిలోమీటర్ల మేర విస్తరించింది. దీంతో వార్డుల సంఖ్య 38కి పెరిగాయి.
అమలుకు నోచుకోని మాస్టర్‌ప్లాన్
వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకుపోతున్న సంగారెడ్డి పట్టణానికి హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడం శాపంగా మారింది. లక్ష జనాభా, 20 వేల భవనాలు కలిగిన జిల్లా కేంద్రంలో మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోవడం లేదు. ఓ వైపు జోన్ల మార్పు, మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోకపోవడం పలు సమస్యలకు దారి తీస్తున్నది. పట్టణంలోని కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ ప్రాంతం ఆస్పత్రి హబ్‌గా అభివృద్ధి చెందుతున్నది. కలెక్టరేట్ మెయిన్ రోడ్డు నుంచి బైపాస్ రోడ్డు వరకు మధ్యలో 60అడుగుల రోడ్డును చూపుతూ మాస్టర్ ప్లాన్‌ను గతంలో రూపొందించారు.
అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ నిర్మాణాలు
కలెక్టరేట్ సమీపంలో మాస్టర్‌ప్లాన్‌ను తుంగలో తొక్కినట్టు తెలుస్తున్నది. కొంతమంది 60 అడుగుల రోడ్డులో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయడంలో అటు హెచ్‌ఎండీఏ, ఇటు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. కలెక్టరేట్ పక్క నుంచి సగం వరకు 60 అడుగుల రోడ్డు ఉండగా, మిగతా రోడ్డును కొంత మంది వ్యక్తులు తమకు చెందినదిగా డాక్యుమెంట్లను చూపి 30 అడుగుల రోడ్డుగా మార్చారు. దీంతో రోడ్డులో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సగానికి తగ్గిన అరవై అడుగుల రోడ్డు
ఈ రోడ్డు దాదాపు కిలోమీటర్ మేర 60 అడుగుల రోడ్డుగా మాస్టర్ ప్లాన్‌లో చూపగా ప్రస్తుతం అర కిలోమీటర్ వరకే 60 ఫీట్ల రోడ్డు ఉన్నది. పూర్తిస్థాయిలో 60అడుగుల రోడ్డు వేయాలంటే పట్టాదారులకు నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో భూములకు గజానికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు డిమాండ్ ఉండడంతో రోడ్డును సైతం వదలడం లేదు. ఇప్పటికైనా కలెక్టరేట్ పక్కన ఉన్న రోడ్డును మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేయాలని, జోన్లను సరిచేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
