అక్రమాలు ఓవర్‌లోడ్‌!

ABN , First Publish Date - 2020-07-22T11:10:06+05:30 IST

రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మంజీరానదిలో జిల్లాలోని హవేళీఘణపూర్‌ మండలం సర్దన గ్రామంలో రెండుచోట్ల

అక్రమాలు ఓవర్‌లోడ్‌!

ఇసుక రీచ్‌లలో నిబంధనలకు నీళ్లు 

తూకం వేయకుండానే విక్రయం

కాంట్రాక్టర్‌తో టీఎస్‌ఎండీసీ అధికారుల కుమ్మక్కు

వాహనాల్లో పరిమితికి మించి తరలింపు

ఓవర్‌లోడ్‌ తో లారీలు వెళ్తున్నా తనిఖీ చేసేందుకు సాహసించని యంత్రాంగం

పాడవుతున్న రోడ్లపై తరచూ ప్రమాదాలు


ఇసుక రీచ్‌లలో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఖనిజాభివృద్ధి సంస్థ అధికారుల అలసత్వంతో కాంట్రాక్టర్లు, వాహన యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్న మేరకు ఇసుకను రవాణా చేయాల్సి ఉండగా తూకం వేయకుండానే వాహనాల్లో ఇసుక లోడ్‌ చేస్తున్నారు. పరిమితికి మించి లారీలు, టిప్పర్లలో ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. తనిఖీలు లేకపోవడంతో ఎవరికి దొరికినంత వారు దోచుకుపోతున్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ, రవాణా, పోలీసు అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూలై 21: రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మంజీరానదిలో జిల్లాలోని హవేళీఘణపూర్‌ మండలం సర్దన గ్రామంలో రెండుచోట్ల ఇసుకక్వారీలను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ నాణ్యమైన ఇసుకను గుర్తించి విక్రయ బాధ్యతలను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. టన్ను ఇసుకకు రూ.650 చొప్పున సీనరేజ్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. మొదట్లో ఉమ్మడి  మెదక్‌ జిల్లాలోని ఇరిగేషన్‌, డబుల్‌బెడ్రూం, ఉపాధిహామీ సీసీ రోడ్డు, ఇతరత్రా ప్రభుత్వ పనులకు ఇసుక తరలించేవారు. కొన్నిరోజులుగా ప్రైవేటు వ్యక్తులకు కూడా విక్రయిస్తున్నారు. కానీ సర్దన-1, సర్దన-2 క్వారీల్లో ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. నదిలో నీటి ప్రవాహం మొదలయ్యే అవకాశం ఉండడంతో కాంట్రాక్టర్లు పెద్దఎత్తున ఇసుకను తవ్వి డంపుల్లో నిల్వ చేసుకున్నారు. ప్రతీరోజు వందలాది లారీలు, టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. డంపుల నుంచి ఇసుకను తీసుకెళ్లడంలో ఇబ్బందులు అయిన రోజు విక్రయాలు నిలిపివేస్తున్నారు. 


కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

ఇసుక విక్రయాల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక అవసరమైన వారు ముందుగానే ఆన్‌లైన్‌లో టన్నులు లేదా క్యూబిక్‌ మీటర్ల లెక్కన బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనుమతి వచ్చిన వెంటనే బుక్‌చేసుకున్న మేరకు వాహనాల్లో తరలిస్తారు. వాహనంలో ఇసుకను నింపి అక్కడే ఉన్న వేబ్రిడ్జిపై తూకం వేసి రశీదు తీసుకోవాలి. కానీ సర్దనలోని రెండు క్వారీల్లోనూ తూకం వేయకుండానే విక్రయాలు చేస్తున్నారు. వానలు కురుస్తున్నాయనే సాకుతో కాటా వేయకుండానే ఎక్స్‌కవేటర్‌తో ఇసుకను వాహనాల్లో నింపి తరలిస్తున్నారు. ఇదేమిటని అడిగితే వర్షం పడటంతో వేబ్రిడ్జి వద్దకు వెళ్లే పరిస్థితి లేదని అక్కడున్న సిబ్బంది సమాధానమిస్తున్నారు. వర్షం ఉన్నా.. లేకున్నా.. కొద్ది నెలలుగా ఇదే తంతు కొనసాగతున్నది. 


పరిమితికి మించినా తనిఖీలు లేవు

ఇసుకను ఏ వాహనంలో ఎంతమేర రవాణా చేయాలో టీఎ్‌సఎండీసీ నిబంధనలు రూపొందించింది. పరిమితికి మించి తరలిస్తే చర్యలు తీసుకుంటారు. లారీ లేదా టిప్పర్‌లో టైర్ల సంఖ్య, సామర్థ్యాన్ని బట్టి లోడింగ్‌ చేయాలి. 10 టైర్ల వాహనంలో 19.5 టన్నులు, 12 టైర్ల వాహనంలో 26 టన్నులు, 14 టైర్ల వాహనంలో 32 టన్నుల ఇసుకను రవాణా చేయాలి. అనుమతించిన మేరకు సీనరేజీ చెల్లించి వే-బిల్లులు పొందుతున్నా.. లోడింగ్‌ సమయంలో మాత్రం ఐదారు టన్నులు ఎక్కువ నింపుతున్నారు. కానీ వాహనాల యజమానులు, కాట్రాక్టర్‌ కుమ్మకై డబ్బులు చెల్లించిన దానికంటే ఎక్కువ ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. అదనంగా నింపిన ఇసుకకు వినియోగదారుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని జేబులో వేసుకుంటున్నారు. కాంట్రాక్టర్‌, టీఎ్‌సఎండీసీ సిబ్బందికి కూడా ఇందులో వాటా ఇస్తున్నారు. ఈ దందా బహిరంగంగానే కొసాగుతున్నా రవాణా, పోలీసుశాఖలు పట్టించుకున్న దాఖలాలు టేవు.


మామూళ్ల మత్తులోనో, పెద్దల కనుసన్నల్లో పని చేయాల్సి రావడం వల్లనో ఆయా శాఖల అధికారులు తనిఖీల జోలికి వెళ్లడం లేదు. హవేలీఘణపూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు ఎక్కడా ఒక్క లారీని కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవంటే ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతీరోజు వందల టన్నుల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా టీఎ్‌సఎండీసీ అధికారులు మాత్రం అంతా బాగుందంటూ కితాబిస్తున్నారు. ఇసుక వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళ్లడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక రీచ్‌లలో నిబంధనల ఉల్లంఘనపై టీఎ్‌సఎండీసీ పీవో రామకృష్ణను ఆంధ్రజ్యోతి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. వరీచ్‌ వద్ద ఉన్న టీఎ్‌సఎండీసీ సిబ్బందిని ప్రశ్నించగా.. తమకేమీ తెలియదని... ఏ విషయమెనా పీవోనే అడగాలని చెప్పడం గమనార్హం. 

Updated Date - 2020-07-22T11:10:06+05:30 IST