అమ్మపాలు.. మురిపాలు

ABN , First Publish Date - 2020-12-13T06:13:25+05:30 IST

బాలింతలకు చనుపాలు రావడం లేదని ఇబ్బందులు పడుతున్నారా..? ఇప్పుడు ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు మీ చెంతకే మదర్‌ ఫీడింగ్‌ బ్యాంకు వస్తున్నది. అదేనండీ తల్లి పాల కేంద్రం. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో త్వరలో సమీకృత తల్లి పాల నిల్వ కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకు) ఏర్పాటు కానుంది.

అమ్మపాలు.. మురిపాలు
సంగారెడ్డిలోని ఎంసీహెచ్‌లో తల్లి పాల బ్యాంకు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర స్ధాయి అధికారులు(ఫైల్‌)

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో తల్లి పాల నిల్వ కేంద్రం

నిలోఫర్‌ తర్వాత సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోనే ఏర్పాటు

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని మొదటి అంతస్తు ఎంపిక

నవజాత శిశువులకు తల్లి పాల సమస్య దూరంపిల్లలకు సరిపడా పాలు లేవని బాధ పడుతున్నారా..? నవజాత శిశువులకు డబ్బా పాలు ఎలా పట్టాలని మధన పడుతున్నారా..?  పుట్టిన బిడ్డ బరువు తక్కువగా  ఉందని ఆందోళన చెందుతున్నారా..? తల్లి పాలు లేక మీ పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయని బాధపడుతున్నారా..? బాలింతలకు చనుపాలు రావడం లేదని ఇబ్బందులు పడుతున్నారా..?  ఇప్పుడు ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు మీ చెంతకే మదర్‌ ఫీడింగ్‌ బ్యాంకు వస్తున్నది. అదేనండీ తల్లి పాల కేంద్రం. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో త్వరలో సమీకృత తల్లి పాల నిల్వ కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకు)  ఏర్పాటు కానుంది. దీంతో తల్లి పాల సమస్యతో ఇబ్బందులు పడే వారు త్వరలో ఉచితంగా తల్లి పాలు పొందవచ్చు.


సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 12 :  బ్లడ్‌ బ్యాంకు.. ఐ బ్యాంకులాగే తల్లి పాల బ్యాంకు. ఇలాంటిది రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రిలో తప్ప మరెక్కడా లేదు ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనూ మధర్‌ మిల్క్‌ బ్యాంకు ఏర్పాటు కానున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న సర్కారు ఇప్పుడు తల్లి పాల బ్యాంకుల ఏర్పాటుకు సంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలను ఎంపిక చేసింది. అత్యవసర పరిస్థితులలో తల్లి పాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. నవజాత శిశువుకు పాల సమస్యను దూరం చేసేందుకు సర్కారు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 


ప్రసవాల్లో ప్రథమం..  అందుకే ప్రాధాన్యం

రాష్ట్రంలో అధికంగా ప్రసవాలు జరిగే ఆస్పత్రుల్లో సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రథమ స్థానంలో ఉంది. నెలలు నిండక తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు చికిత్స అందించేందుకు నవజాత శిశు సంరక్షణ కేంద్రమూ ఇక్కడ ఉన్నది. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి ఉమ్మడి మెదక్‌ జిల్లా వాసులే కాకుండా రంగారెడ్డి, వికారాబాద్‌, ఇతర జిల్లాల వారు ప్రసవం కోసం ఇక్కడికి వస్తుంటారు. నిత్యం 25-35 వరకు డెలవరీలు జరుగుతుంటాయి. వాటిలో సాధారణ ప్రసవాలే 80 శాతం ఉంటాయి. ఇలా ప్రతి నెలా 600-700 ప్రసవాలు జరగడం విశేషం. ఈ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రంలో శిశువులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. నిత్యం 80 మందికి పైగా ఓపీ ద్వారా, నెలకు 100 మంది వరకు నవజాత శిశువుల అడ్మిషన్లు జరుగుతుంటాయి. సాధారణంగా తల్లుల్లో జన్యు లోపాలు, ఒత్తిడి, వయస్సు ఎక్కువగా ఉన్న వారికి పాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. బరువు తక్కువగా పుట్టిన శిశువులు, నెలలు నిండకుండా జన్మించిన పిల్లలకు, తల్లి పాలు అందని శిశువులకు వీటిని ఉపయోగిస్తారు.

  

రూ.2 కోట్లతో నిర్మాణం

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో 3,700 చదరపు గజాల స్థలంలో తల్లి పాల నిల్వ బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.2 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, సదాశివపేట, జహీరాబాద్‌, జోగిపేట, నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రసవమైన తల్లుల నుంచి ఈ పాలను సేకరిస్తారు. తల్లుల సమ్మతితోనే పాలను సేకరిస్తారు. శిశువు చనిపోయిన అమ్మలు, స్వచ్ఛందంగా వచ్చిన తల్లుల నుంచి పాలను సేకరించి వాటిని పాల బ్యాంకులో భద్రపరుస్తారు. ఇక్కడ డాక్టర్‌తో పాటు ఇతర సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తారు.


త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం

ప్రతి శిశువుకూ తల్లి పాలు అందించడమే లక్ష్యంగా సర్కారు తల్లి పాల బ్యాంకు ఏర్పాటు చేస్తోంది. సంగారెడ్డిలోని ఎంసీహెచ్‌లో త్వరలో తల్లి పాల బ్యాంకు అందుబాటులోకి రానుంది. ఇటీవలే అధికారులు ఆస్పత్రిని సందర్శించి ఏర్పాటుకు మొదటి అంతస్తును ఎంపిక చేశారు. నవజాత శిశువుకు తల్లి పాలకు ఢోకా ఉండదని ఆశిస్తున్నాం. తల్లి పాలతో శిశువులు ఇన్‌ఫెక్షన్‌ గురికాకుండా ఆరోగ్యంగా వృద్ధి చెంది సురక్షితంగా ఉంటారు. 

- డాక్టర్‌ సంగారెడ్డి, సూపరింటెండెంట్‌, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి


Updated Date - 2020-12-13T06:13:25+05:30 IST