బీమా లేక బేజారు!

ABN , First Publish Date - 2020-11-13T09:52:31+05:30 IST

పంట బీమా లేక రైతన్న ఆధారం పోయింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల జిల్లావ్యాప్తంగా 1,87,329 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వాతావరణ

బీమా లేక బేజారు!

పంటల బీమా రద్దుతో లక్షా 23 వేల మంది రైతులకు నష్టం

లక్షా 87 వేల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్న పంటలు 

పరిహారం రాక గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు 


సంగారెడ్డి టౌన్‌, నవంబరు 12 : పంట బీమా లేక రైతన్న ఆధారం పోయింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల జిల్లావ్యాప్తంగా 1,87,329 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ఉండేది. భారీ వర్షాలు, ఇతర కారణాలతో పంటలు దెబ్బతింటే ఈ పథకం కింద నష్టాన్ని అంచనా వేసి రైతుల బ్యాంకుల ఖాతాల్లో పరిహారాన్ని జమచేసేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీమా పథకాన్ని రద్దు చేయడంతో సంగారెడ్డి జిల్లాలో లక్షా 23 వేల మంది రైతులు నష్టపోయారు. 


5,83,597 ఎకరాల్లో పంటల సాగు

ఈ వర్షాకాలం సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురియడం వల్ల జిల్లాలో పత్తి, కంది, సోయాబీన్‌, చెరకు, వరి, జొన్న, మినుములు, పెసర తదితర పంటలు సాగుచేశారు. ఈ సీజన్‌లో అన్ని పంటలు కలిపి 5,83,597 ఎకరాల మేర సాగు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో ప్రధాన పంటలైన పత్తి 3,43,286 ఎకరాల్లో లక్షా 25 వేల మంది రైతులు సాగుచేశారు. కంది పంటను 61,737 ఎకరాల్లో 55 వేల మంది రైతులు సాగుచేశారు. సోయాబీన్‌ను 55,413 ఎకరాల్లో 20 వేల మంది సాగుచేయగా, వరి పంటను 15,944 ఎకరాల్లో సాగు చేసినట్టు అధికారులు అంచనా వేశారు. ఈ సారి పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం వల్ల మొత్తమ్మీద సగం మంది రైతులు నష్టపోయారు. 


1,87,329 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

జిల్లాలోని అన్ని మండలాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 1,87,329 ఎకరాల్లో వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు గుర్తించారు. పంటల బీమా పథకం యధావిధిగా కొనసాగితే ఈ రైతులందరికీ ప్రయోజనం చేకూరేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో కురిసిన వర్షాల వల్ల వరి 15,548 ఎకరాల్లో, పత్తి 1,50,200 ఎకరాల్లో, కంది 10,500 ఎకరాల్లో, సోయాబీన్‌ 5603 ఎకరాల్లో, చెరుకు 5478 ఎకరాల్లో నీటి పాలు కాగా మొత్తమ్మీద లక్షా 23 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు.


కేంద్ర ప్రభుత్వ పథకం అమలుపై సందిగ్ధం

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) నేరుగా పంటల బీమా పథకాన్ని కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది. కేవలం పత్తి, మిరప పంటలకు వర్ష బీమా పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పత్తి పంటను అత్యధికంగా సాగు చేశారు. మిగిలిన కంది, వరి, సోయాబీన్‌, మినుములు, పెసర, జొన్న, మొక్కజొన్న, చెరకు పంటల సాగును బీమాలో చేర్చకపోవడంతో ఆ రైతులకు నిరాశ తప్పడం లేదు.

Updated Date - 2020-11-13T09:52:31+05:30 IST