హిందువులు సంఘటితం కావాలి.. బండి సంజయ్ కామెంట్స్..
ABN , First Publish Date - 2020-12-30T06:06:10+05:30 IST
హిందువులందరూ సంఘటితమై అయోధ్యలో రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్
జహీరాబాద్, డిసెంబరు 29: హిందువులందరూ సంఘటితమై అయోధ్యలో రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఝరాసంగం మండలం బర్దీపూర్‌లోని దత్తగిరి ఆశ్రమంలో మంగళవారం దత్త జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్యలో ప్రపంచం అబ్బురపడేలా నిర్మిస్తున్న రామమందిర నిర్మాణం 2023లో పూర్తవుతుందని చెప్పారు. రామమందిర నిర్మాణం కోసం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిధి సేకరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ హిందువు తమవంతు సహకారం అందజేయాలని కోరారు. దేశ సంరక్షణ, ధర్మ పరిరక్షణ కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో హిందువులు సనాతన ధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని హితవు పలికారు. కాశ్మీర్‌లో హిందువులు, ఏబీవీపీ నాయకులపై జరుగుతున్న హత్యాచారాలపై ప్రతీ ఒక్కరు స్పందించాలని కోరారు. అనంతరం తెలంగాణ సమతా కన్వీనర్ అప్పల ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశం మానవీయ విలువలు, ఆత్మీయ సంబంధాలకు గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన దేశంలో త్వరలోనే మరో ఆధ్యాత్మిక విప్లవం రాబోతున్నదని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో బర్దీపూర్ ఆశ్రమ పీఠాధిపతి అవదూతగిరి మహరాజ్, బావి పీఠాధిపతి సిద్ధేశ్వరస్వామి, బీజేపీ నాయకులు కోహీర్ సంగమేశ్వర్, జగన్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్, సుధీర్‌బండారి, మల్లికార్జున్‌పాటిల్, అరుణాకౌలాస్, అర్చనాసారడా, శ్రీనివా్‌సగుప్తా తదితరులు పాల్గొన్నారు.