నరకప్రాయంగా నారాయణఖేడ్- బీదర్ రోడ్డు
ABN , First Publish Date - 2020-12-14T04:56:59+05:30 IST
జహీరాబాద్ నుంచి బీదర్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.

అర్ధాంతరంగా పనులు.. అరకొర మరమ్మతులు
నాణ్యత కరువై ఏటా కోట్ల రూపాయలు వృఽథా
శాశ్వత పరిష్కారానికి నోచుకోని వైనం
గుంతల రోడ్డుతో తరుచూ ప్రమాదాలు
జహీరాబాద్ డిసెంబరు 13: జహీరాబాద్ నుంచి బీదర్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న జహీరాబాద్ మండలం కర్ణాటక సరిహద్దులకు సమీపంలో ఉండడం వల్ల మండలంలోని ప్రజలు బీదర్‌కు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. బీదర్ పెద్ద పట్టణమే కాకుండా అక్కడ అన్నిరకాల సౌకర్యాలు ఉండడంతో స్థానిక ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ప్రతీ రోజు వేల సంఖ్యలో బీదర్‌పట్టణానికి వెళ్తుంటారు. ఏటా కోట్లాది రూపాయలు మరమ్మతుల పేరిట ఖర్చు చేస్తున్నా నాణ్యత కరువై ప్రయోజనం లేకుండా పోతున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు.
గుంతల రోడ్డుతో ఇబ్బందులు
జహీరాబాద్- బీదర్ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగానే ఉంటుంది. జహీరాబాద్ నుంచి బీదర్ సుమారు 35-40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రవాణాతో పాటు వివిధ అవసరాల నిమిత్తం హైదరాబాద్ కంటే బీదర్ అన్నివిధాలుగా సౌకర్యవంతంగా ఉంటుందని భావించి ప్రజలు అధికసంఖ్యలో వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తారు. అయితే ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డు లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ నుంచి కర్ణాటక బార్డర్ వరకు రోడ్డుపై అక్కడక్కడా గుంతలు పడడంతో అత్యవసర సమయాల్లో ప్రయాణం మరింత ఇబ్బందిగా తయారైందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని ఇక్కడి ప్రజలు అంటున్నారు. అత్యవసర సమయాల్లో బీదర్ వెళ్లడం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ రోడ్డుపై ప్రయాణం గుర్తుకు వస్తే జంకే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రమాదాలబారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ రోడ్డు బాగుంటే ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
తరుచూ మరమ్మతులే
నారాయణఖేడ్ మండలం నుంచి బీదర్‌కు వెళ్లే రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండడంవల్ల తరుచూ రోడ్డు గుంతలమయంగా మారుతున్నది. అధికారులు మరమ్మతుల పేరిట ఏటా కోట్ల రూపాయలను మంజూరు చేయించి పనులను చేయిస్తున్నా, పనుల్లో నాణ్యత లోపించడంతో మున్నాళ్ల ముచ్చటగా మారుతున్నదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రూ.3 కోట్ల టెండర్.. అసంపూర్తి పనులు
ఆర్‌అండ్‌బీ శాఖలో పనులకు సంబంధించి నిధుల కొరత ఉన్నందున పనులను చేసేందుకు టెండర్ ద్వారా కాంట్రాక్టర్ ముందుకు రావడమే అరుదు. పనులు చేశాక బిల్లుల విషయంలో పెట్టిన పెట్టుబడులు రాకనష్టాలకు గురవుతామని భావించి కొందరు కాంట్రాక్టర్లు పనులను అసంపూర్తి దశలో వదిలేసి వెళ్లిపొతున్నారు. దీంతో పనులు పూర్తి కాక అధికారులు, రోడ్డుపై ప్రయాణించలేక వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పాడైన బీదర్ రోడ్డు 19కిలోమీటర్ల మరమ్మతుకు గాను ఏడాదిక్రితం రూ. 3కోట్లకు ఓ కాంట్రాక్టరు టెండర్‌వేసి కొంతదూరం మరమ్మతులు చేపట్టి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. ఇప్పటివరకు పనులను చేపట్టనే లేదు. సకాలంలో పనులను చేయనందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు కాంట్రాక్టరుకు నోటీసులను ఇచ్చి టెండరు పనులను రద్దు చేశారు. తిరిగి టెండర్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు వివరించారు.
నరకప్రాయం..
జహీరాబాద్ సమీపంలోని బైపా్‌సరోడ్డు నుంచి అల్లానా కర్మాగారం మీదుగా బీదర్‌కు వెళ్లేరోడ్డు వరకు 6 కిలోమీటర్ల దూరం ఉండగా 3కిలో మీటర్ల రోడ్డు పూర్తిగా పాడై వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోడ్డుపై వాహనాలను నడిపించాలంటే వాహనచోదకులకు నరకప్రాయమే. ఈ రోడ్డును బాగుచేసి తమ ఇబ్బందులను తొలగించాలని అధికారులకు, నాయకులకు విన్నవించినా ఫలితం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులను వివరణ కోరగా పాడైన బీదర్‌రోడ్డుకు త్వరలో మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు.
