కరెంటోళ్లపై గరం
ABN , First Publish Date - 2020-12-15T05:52:09+05:30 IST
ట్రాన్స్‌కో అధికారుల పని తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్ శాఖ సిబ్బంది తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యుల ఆగ్రహం
రైతులు తిరగబతారని హెచ్చరిక
విద్యుత్ అధికారుల సమాధానం షాక్ కొట్టినట్లు ఉంది : కలెక్టర్ వెంకట్రామారెడ్డి
మెదక్ రూరల్, డిసెంబరు 14: ట్రాన్స్‌కో అధికారుల పని తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ సమావేశంలో చెబుతున్నా తీరు మారడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. ఉన్నతాధికారులు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయారు. కలెక్టర్ వెంకట్రామారెడ్డి కూడా అధికారుల సమాధానంపై అసహనం వ్యక్తం చేశారు. షాక్ కొట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
జడ్పీ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ హేమలత అధ్యక్షతన సోమవారం జరిగింది. ఇన్‌చార్జి కలెక్టర్ వెంకట్రామారెడ్డి, మెదక్, దుబ్బాక ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రఘునందన్‌రావు, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ చంద్రంగౌడ్ హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా విద్యుత్ శాఖ పనితీరుపైనే చర్చించారు. జిల్లా కేంద్రంలోని దయారలో లోవోల్జేజీ సమస్య తీర్చడం కోసం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని సూచించించినా ఎందుకు ఏర్పాటు చేయడంలేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులను ప్రశించారు. గ్రామాల్లో స్తంభాలు ఏర్పాటు చేసి యేడాది దాటినా తీగలు ఏర్పాటు చేయలేదని, డీఈ స్పందించడం లేదని జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ యూసూఫ్ మండిపడ్డారు. నర్సాపూర్ మండలం మాదాపూర్‌లో ఓ రైతు డీడీలు చెల్లించి ఏడాది గడిచినా విద్యుత్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాడంలేదని.. కానీ స్టేట్‌సలో మాత్రం ఏర్పాటు చేసినట్లు వస్తుందని జడ్పీటీసీ బాబ్యానాయక్ పేర్కొన్నారు. శివ్వంపేట మండలంలో లైన్‌మెన్, ఏఈ అందుబాటులో ఉండటంలేదని ఎంపీపీ హరికృష్ణ ఫిర్యాదు చేశారు. కొల్చారం మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజూల పేర్కొన్నారు.
మెడపై కత్తి పెట్టి పనులు చేయించి పైసలివ్వరా?
గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం కోసం సర్పంచ్‌ల మెడపై కత్తిపెట్టి పనులు చేయించిన ఎంపీడీవోలు బిల్లులు మాత్రం ఇప్పించడం లేదని చేగుంట ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పూర్తిచేయించడంలో చూపిన ఉత్సాహం బిల్లులు ఇప్పించడంలో చూపకపోవడంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు కనీసం సిమెంట్ కూడా ఇవ్వడం లేదని వెల్దుర్తి జడ్పీటీసీ రమేశ్‌గౌడ్ పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారం రోజుల్లో బిల్లులు ఇప్పించాలని ఆదేశించారు. చిల్‌పచేడ్ మండలంలో పంచాయతీ కార్యదర్శులతో పాటు సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీపీ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
పీహెచ్‌సీలో సిబ్బందిని నియమించండి
కొల్చారం పీహెచ్‌సీలో సిబ్బంది లేకపోవడంతో కాన్పులు చేయడం లేదని జడ్పీటీసీ మేఘమాల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఒకే స్టాఫ్ నర్సు ఉండటంతో ప్రజలు వైద్యం కోసం ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. చేగుంట మండలం రాంపూర్‌లో వందల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నా సంబంధిత శాఖ అధికారులు స్పందించడం లేదని చేగుంట ఎంపీపీ వాపోయారు. టేక్మాల్ మండలంలో 28 గ్రామాలకు ఒకే పశువైద్యాధికారి ఉన్నాడని ఎంపీపీ పేర్కొన్నారు. గ్రామాల్లో పశువుల సంఖ్య ఆధారంగా రేషనలైజ్ చేసి సిబ్బందిని నియమించాలని కలెక్టర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనాఽథ్, డీఎంహెచ్‌వో వెంకేటశ్వరావు, డీఏవో పరుశురాం, డీడబ్ల్యూవో రసూల్‌బీ, పీఆర్‌ఈఈ రాంచంద్రారెడ్డి, ఐరిగేషన్ ఈఈ ఏశయ్య, డీఈవో రమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఐదు అంశాలపైనే చర్చ
జడ్పీ సర్వసభ్య సమావేశం ఎజెండాలో 46 అంశాలున్నా.. ఐదు అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. సమావేశం 11 గంటలకు నిర్వహించాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా ప్రారంభమైంది. జడ్పీటీసీలు, ఎంపీపీలు మరింత ఆలస్యంగా వచ్చారు. మొదట గ్రామీణాభివృద్ధి శాఖలో జరుగుతున్న పనులను డీఆర్‌డీవో శ్రీనివాస్ వివరించారు. అనంతరం వ్యవసాయం, విద్యుత్, ఆరోగ్య, విద్యా శాఖలపై చర్చ జరిగింది. గత సమావేశంలో మూడు అంశాలపైనే చర్చ నిర్వహించగా.. ఈసారి రెండు అంశాలను పెంచారు.