హరీశ్‌రావుది రెండు కళ్ల సిద్ధాంతం

ABN , First Publish Date - 2020-09-25T06:10:33+05:30 IST

‘మంత్రి హరీశ్‌రావు దుబ్బాక, సిద్దిపేట నాకు రెండు కళ్ళు అంటున్నడు... ఒక్క కన్నుతో దుబ్బాకను ఆగం చెస్తడు.

హరీశ్‌రావుది రెండు కళ్ల సిద్ధాంతం

ఒక్క కన్నుతో దుబ్బాకను ఆగం చేస్తడు 

నమ్మి గోస పడొద్దు

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు


తొగుట, సెప్టెంబరు 24 :  ‘మంత్రి హరీశ్‌రావు దుబ్బాక, సిద్దిపేట నాకు రెండు కళ్ళు అంటున్నడు... ఒక్క కన్నుతో దుబ్బాకను ఆగం చెస్తడు.. ఆలోచన చేసి టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు  పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్‌.బంజరుపల్లి, లింగాపూర్‌, రాంపూర్‌, తుక్కాపూర్‌, తొగుట గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం తొగుటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మోసపు మాటలు చెబుతారు.. నమ్మి మోసపోయి గోస పడొద్దు అని సూచించారు. దుబ్బాకకు వచ్చే నిధులన్నీ సిద్దిపేటకు తరలించి అభివృద్ధి చేసుకుని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురిచేశారని విమర్శించారు. బీజేపీ వస్తే పెన్షన్‌ కట్‌ అవుతుందని ప్రజలను బెదిరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. గజ్వేల్‌కు వంద పడుకల ఆస్పత్రి, సిద్దిపేటకు మెడికల్‌ కళాశాల మంజూరు చేయించుకుని దుబ్బాకకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకను అనగా దొక్కాలని చూస్తే.. ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని స్పష్టం చేశారు.


మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సొమ్ముతోనే రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేస్తుందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నవేనని మరిచి పోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విభీషన్‌ రెడ్డి, బాలే్‌షగౌడ్‌, విజయ్‌ కుమార్‌, నర్సింహారెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టున్న తొగుట మండలంలోని లింగాపూర్‌, తుక్కాపూర్‌, రాంపూర్‌, ఎల్‌ బంజర్‌పల్లి, తొగుట గ్రామాల్లో గురువారం బీజేపీ సభలు సక్సెస్‌ కావడంతో మండలంలోని బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల స్వగ్రామంలో నుంచి ఎక్కువ మంది యువకులు బీజేపీలో చేరడం గమనార్హం.

Updated Date - 2020-09-25T06:10:33+05:30 IST