పీజీ కళాశాల భవన నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి : హరీశ్

ABN , First Publish Date - 2020-03-12T08:25:02+05:30 IST

సిద్దిపేట పీజీ కళాశాల భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఉస్మానియా

పీజీ కళాశాల భవన నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి : హరీశ్

 సిద్దిపేట అగ్రికల్చర్‌, మార్చి 11: సిద్దిపేట పీజీ కళాశాల భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు   ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ గోపాల్‌ రెడ్డి, ఓయూ ఎస్‌ఈని, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఓయూ రిజిస్ట్రార్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. సిద్దిపేటలో రూ.5కోట్లతో బాలుర, బాలికల హస్టల్‌, పీజీ కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ పనులు 2014లో ప్రారంభమయ్యాయని, అప్పటి నుంచి పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


పనుల జాప్యానికి కారణం ఏమిటని ఓయూ రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డిని, ఇంజనీరింగ్‌ అధికారులను, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ను, నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌ను మంత్రి ప్రశ్నించారు. బాలికల హస్టల్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని, బాలుర హస్టల్‌ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పీజీ కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ పనులు పూర్తి కావస్తున్నాయని, ల్యాబ్‌ పనులు, ఫర్నీచర్‌, విద్యుత్‌ పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. పదిరోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాల్సిందేనని అల్టిమేటం జారీచేశారు. ఇంజనీరింగ్‌  అధికారులు, కాంట్రాక్టర్‌ సమన్వయంతో వ్యవహరించి పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు.

నర్సాపూర్‌, జోగిపేట పీజీ కళాశాలలకు వసతులు కల్పించండి

నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి, ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ తమ నియోజకవర్గాల్లోని పీజీ కళాశాల పరిస్థితులను మంత్రి హరీశ్‌రావుకు సమావేశంలో వివరించారు. కళాశాలలను ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి వేరే చోటికి తరలిస్తున్నారన్న వందతులు వస్తున్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. నర్సాపూర్‌ పీజీ కళాశాలను ప్రస్తుతం ఉన్న బిల్డింగ్‌ నుంచి అదే ప్రాంతంలో అన్ని వసతులు ఉన్న బిల్డింగ్‌లోకి మార్చాలని సూచించారు.


విద్యార్థులతో మాట్లాడి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఓయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. జోగిపేటలో పీజీ కళాశాల భవన నిర్మాణానికి  నాలుగున్నర ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందని ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మంత్రికి తెలిపారు. భవన నిర్మాణానికి నిధులను విడుదల చేయాలని కోరారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు సమకూరేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పీజీ కళాశాలలను ఉన్న ప్రాంతంలోనే ఉంచాలని, ఎక్కడికి తరలించొద్దని అధికారులను ఆదేశించారు.


Updated Date - 2020-03-12T08:25:02+05:30 IST