టికెట్ ఇస్తే జై..లేదంటే నై అంటారా? ఇంత కంటే అన్యాయం ఉంటదా !
ABN , First Publish Date - 2020-10-08T20:29:08+05:30 IST
టికెట్ ఇస్తే జై కొట్టుడు...లేదంటే నై అంటడా? ఇంత కంటే అన్యాయం ఉంటదా అని చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకు కొండల్‌రెడ్డితో పాటు పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఓపిక పడితే మంచి స్థాయి కల్పిస్తామని చెప్పినా వినలేదు
టీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్ పోరాటం డిపాజిట్ కోసమే !
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
తొగుట(మెదక్): టికెట్ ఇస్తే జై కొట్టుడు...లేదంటే నై అంటడా? ఇంత కంటే అన్యాయం ఉంటదా అని చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకు కొండల్‌రెడ్డితో పాటు పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. టికెట్ ఇస్తే మంచోళ్లని, ఇవ్వకపోతే చెడ్డ వాళ్లమా అని ప్రశ్నించారు. నిన్నటి వరకు కేసీఆర్, హరీశ్‌రావు జై అని పాటలు పెట్టి తిరిగారని.. ఓపిక పడితే మంచి స్థాయి కల్పిస్తామని చెప్పినా వినలేదని.. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారడం ఏమిటని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ డిపాజిట్‌ను దక్కించుకోవడానికే పోరాటం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో లక్ష ఇళ్లకు బిల్లును ప్రవేశపెట్టామని, కరోనా రావడంతో ఆలస్యం జరిగిందని తెలిపారు. గ్రామంలో ఖాళీ స్థలం ఉండే వాళ్లకి త్వరలోనే ఇల్లు కట్టించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అంతకు ముందు మంత్రి హరీశ్‌రావుకు డప్పుచప్పుళ్లతో టీఆర్‌ఎస్ నాయకులు భారీగా ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ లతానరేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అనితా లక్ష్మారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు చెరుకు లక్ష్మారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు కలీమొద్దీన్, కొండపాక మాజీ ఎంపీపీ కనకయ్య, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
కాశేశ్వరం నీళ్లతో కాళ్లు కడుగుతున్న ఘనత టీఆర్‌ఎస్‌దే : హరీశ్‌రావు
కాళేశ్వరం నీళ్లు తెచ్చి దుబ్బాక కాళ్లు కడుగుతున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని ఓ పంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాకలో రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దివంతగ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇంటింటికీ తాగునీళ్లను అందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువులు దొరికేవి కావని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎరువుల సమస్యలను తీర్చడంతోపాటు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. రంగనాయకసాగర్ ప్రాజెక్ట్‌ను, మల్లన్నసాగర్ పంపుసెట్లను చూసి కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వారు ఒక ఎకరానికి సాగునీరును అందించిన దాఖలాలు లేవన్నారు. కాశేశ్వరం నీళ్లతో దుబ్బాకలో కొన్ని చెరువులను కూడా నింపామన్నారు. త్వరలోనే అన్ని చెరువులను నింపడంతో పాటు నియోజవకర్గంలోని లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరును అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
చనిపోయిన రైతులకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రైతుల సంంక్షేమమే లక్ష్యంగా 5 లక్షల బీమాను కల్పించి రైతు కుటుంబానికి భరోసా కల్పించిందన్నారు. దుబ్బాకలో జరిగే ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే ఆశయాలను కొనసాగించాలంటే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సుజాతక్క గెలుపునకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. అనంతరం కమ్మర్‌పల్లి ఎంపీటీసీ ఎల్ రాంరెడ్డి, మిరుదొడ్డి ఎంపీటీసీ నర్సింహులు కాంగ్రెస్ పార్టీని వీడీ హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతారామలింగారెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి పాల్గొన్నారు.