ఐదోసారీ పొడిగింపే!

ABN , First Publish Date - 2020-02-12T09:39:39+05:30 IST

చేనేత జౌళి పరిశ్రమను అభివృద్ధిలో భాగంగా ఏర్పాటుచేసిన సహకార సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం

ఐదోసారీ పొడిగింపే!

  • చేనేత సహకార సంఘాల ఎన్నికలు ఎప్పుడో?
  • సుదీర్ఘంగా కొనసాగుతున్న పర్సన్‌ ఇన్‌చార్జిల పాలన
  • సిద్దిపేట జిల్లాలో 18, మెదక్‌ జిల్లాలో ఆరు సొసైటీలు

సిద్దిపేట, ఫిబ్రవరి 11 : చేనేత జౌళి పరిశ్రమను అభివృద్ధిలో భాగంగా ఏర్పాటుచేసిన సహకార సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. ఆరు నెలలకోసారి చొప్పున ఇప్పటికే ఐదుసార్లు పర్సన్‌ ఇన్‌చార్జిల పాలనను పొడిగించింది. ఐదేళ్లకోసారి నిర్వహించాల్సిన ఎన్నికలు చివరిసారిగా 2013 ఫిబ్రవరి 11న జరిగాయి. గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలలకోసారి పాలకవర్గం గడువు పెంచుతున్నది. మంగళవారం తాజాగా మరోమారు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతో సంఘాలకు ఎన్నికలు జరుగుతాయని ఆశించిన చేనేత కార్మికులకు తీవ్ర నిరాశ మిగులుతున్నది. పీఏసీఎ్‌సల ఎన్నికల తర్వాతైనా ప్రభుత్వం ఈ సొసైటీల ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు కోరుతున్నారు. 

చేనేత జౌళిశాఖ సిద్దిపేట ఏడీ కార్యాలయం పరిధిలో సిద్దిపేట, మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల చేనేత సహకార సంఘాలు వస్తాయి. జిల్లాలవారీగా సిద్దిపేటలోని 18 సంఘాలలో 4,362 మంది, మెదక్‌లోని 6 సొసైటీల పరిధిలో 2,108 మంది, నిజామాబాద్‌లోని 4 సొసైటీల పరిధిలో 1,657 మంది, కామారెడ్డిలోని 4 సంఘాల పరిధిలో 1,947 మంది సభ్యులున్నారు. పీఏసీఎస్‌ ఎన్నికల విషయంలో పచ్చజెండా ఊపిన ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను మరిచిపోయింది. వీటి ఎన్నికల నిర్వహణ గురించి ఇప్పటివరకు ఎలాంటి ఊసు లేదు. సూత్రప్రాయంగా ప్రకటనలు కూడా వెలువడటం లేదు. గత పాలకవర్గాల పదవీ 2018 ఫిబ్రవరి 10న ముగిసింది. అప్పటి నుంచి ప్రతి ఆరునెలలకోసారి పాలకవర్గం పదవీకాలం గడువు పొడిగిస్తున్నది. ఐదోసారి మంగళవారం గడువు పొడిగింపు ఉత్తర్వులు వెలువడ్డాయి. గతేడాది ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. తర్వాత వరుసగా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ముందుకురావడంతో ఈ ఎన్నికలు వాయిదాపడ్డాయి. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు పీఏసీఎ్‌సల ఎన్నికలు నిర్వహిస్తున్నది. కానీ చేనేత సహకార సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జిల పేరిట అదే కమిటీల పాలన కొనసాగుతున్నది. దాంతో చేనేత సంఘాల నిర్వహణ కుంటుపడ్తున్నది. 


డీసీసీబీలో ప్రాతినిధ్యం విషయంలో

ఉమ్మడి మెదక్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో చేనేత సహకార సంఘాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. డీసీసీబీలో చేనేత సహకార సంఘాల నుంచి ఒకరు డైరెక్టర్‌గా ఉంటారు. పీఏసీఎ్‌సలకు ఎన్నికలు జరుపుతున్న ప్రభుత్వం చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో డీసీసీబీ కొత్త పాలకవర్గంలో చేనేత సంఘాల వారికి ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంటుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ప్రస్తుతం ఉన్న పాలకమండళ్ల ద్వారా ఎన్నికైన పాత డైరెక్టర్‌నే ఇందులోనూ కొనసాగిస్తారని భావిస్తున్నారు. 


నష్టాల బాటలోనే చాలా సంఘాలు

సిద్దిపేట జిల్లాలో 18 చేనేత సహకార సంఘాలుండగా.. అందులో 11 సొసైటీలలో ఏనేత కార్మికులకు పని కల్పించడం లేదని సమాచారం. అవి దాదాపుగా మూతపడ్డ స్థితిలో ఉన్నాయి. సిద్దిపేటలోని ఆదర్శ సొసైటీ, శ్రీరాములపల్లి, పొట్లపల్లి, చేర్యాల, దుబ్బాక సొసైటీలు మాత్రమే లాభాల బాటలో ఉన్నట్లు అధికారిక సమాచారం. నిజామాబాద్‌ జిల్లాలో నాలుగు సంఘాలుండగా ఒకటి లాభాలలో ఉన్నది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు, మెదక్‌ జిల్లాలోని ఐదు సంఘాలు మూతపడ్డాయని తెలిసింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక సంఘంలో అత్యధికంగా 1,780 మంది, అత్యల్పంగా సిద్దిపేట ఆదర్శలో 41 మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. సిద్దిపేటలోనే ఆరు సొసైటీలుండగా.. ఒక్కటి మాత్రమే లాభాలు ఆర్జిస్తున్నది. నిజామాబాద్‌ జిల్లాలో నాలుగు సంఘాలుండగా అత్యధికంగా నిజామాబాద్‌ సంఘంలో 867 మంది, అత్యల్పంగా బోధన్‌ సొసైటీలో 116 మంది చేనేతన్నలు సభ్యులుగా ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో నాలుగు సంఘాలుండగా కామారెడ్డి సంఘంలో అతి తక్కువగా 80 మంది, దోమకొండ సొసైటీలో అధికంగా 422 మంది ఉన్నారు. మెదక్‌ జిల్లాలో ఆరు సంఘాలుండగా అధికంగా మెదక్‌ సొసైటీలో 823 మంది, అత్యల్పంగా ముస్లాపూర్‌, పాపన్నపేట, శంకరంపేట సొసైటీలలో వందమంది చొప్పున సభ్యులున్నారు. చేనేత సంఘాలలో 11 మంది డైరెక్టర్లు ఉంటారు. అందులో ఒకరు అధ్యక్షుడిగా,  మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. 


ఓటర్ల జాబితాలు రూపొందించని కొన్ని సంఘాలు

చేనేత సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి చాలా సంఘాలలో ఓటర్ల జాబితాలను గతంలోనే సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లాలోని ఆరు సంఘాలు ఇంతవరకు ఓటర్ల జాబితాలు రూపొందించలేదని అధికారిక సమాచారం. గతంలో సంఘంలో సభ్యులుగా ఉన్న వ్యక్తి తన పాస్‌బుక్‌ నెంబరు ఆధారంగా ఓటు వేసేవారు. ఈసారి సభ్యత్వం ఉన్న చేనేత కార్మికుడు సభ్యత్వం పొందిన తేదీ ఆధారంగా ఆ వ్యక్తి ఫొటోతో ఓటరు జాబితా రూపొందించారు. గతంలోనే వీటిపై ఫిర్యాదులు స్వీకరించి సవరణలు చేశారు. ఈ జాబితాలు రూపొందించి రెండేళ్లయినా ఎన్నికలు జరుగకపోవడంతో చేనేత కార్మికులు నిరాశకు గురవుతున్నారు. గత పాలకవర్గాలు సంఘాన్ని పట్టించుకోవడం లేదని కొత్త పాలకవర్గం వస్తే అయినా బాగుపడ్తాయేమోనని ఆశిస్తున్న వారికి నిరాశే ఎదురవుతున్నది.

Updated Date - 2020-02-12T09:39:39+05:30 IST