రూ. 50 లక్షల విలువైన గుట్కా పాకెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-20T05:57:20+05:30 IST

డీసీఎంలో సుమారు రూ.50 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా పాకెట్లను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

రూ. 50 లక్షల విలువైన గుట్కా పాకెట్లు స్వాధీనం
గుట్కా సంచులు, డ్రైవర్‌ను చూపుతున్న డీఎస్పీ


మనోహరాబాద్‌, డిసెంబరు 19:  డీసీఎంలో సుమారు రూ.50 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా పాకెట్లను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తూప్రాన్‌  డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన సీఐ స్వామిగౌడ్‌తో కలిసి మనోహరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతం నుంచి డీసీఎం(టీఎస్‌ 01 యూఏ 6498) వాహనంలో నిజామాబాద్‌కు గుట్కా పాకెట్లను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం 7.30 కు  సిబ్బందితో కలిసి మనోహరాబాద్‌ జాతీయరహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తూ డీసీఎంను ఆపి పరిశీలించగా  50 సంచుల గుట్కా ప్యాకెట్లు లభించాయన్నారు. వాహనంతో పాటు గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలకేంద్రానికి చెందిన డ్రైవర్‌ దుర్గం గోవర్ధన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా గుట్కాను బీదర్‌ నుంచి నిజామాబాద్‌లోని శ్రీకృష్ణ ట్రేడర్స్‌కు తరలిస్తున్న వెల్లడించినట్టు డీఎస్పీ వివరించారు. గుట్కాను పట్టుకోవడంలో  చాకచక్యంగా వ్యవహరించిన  సీఐ స్వామి గౌడ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం శ్రీనివాసులు, సిబ్బంది అంజనేయులు, కృష్ణ తదితరులను డీఎస్పీ అభినందించారు.  

Updated Date - 2020-12-20T05:57:20+05:30 IST