రైతుకు తీపికబురు

ABN , First Publish Date - 2020-05-09T09:56:31+05:30 IST

మెదక్‌ జిల్లాలో రుణమాఫీకి అర్హులను గుర్తించేందుకు పంచాయతీ సెక్రటరీ, వ్యవసాయ విస్తరణ అధికారి, వీఆర్వోలతో పాటు

రైతుకు తీపికబురు

తొలివిడతగా రూ.25 వేలలోపు రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌

కుటుంబం యూనిట్‌గా అమలు

సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో అర్హుల జాబితా రెడీ

సంగారెడ్డి జిల్లాలో అర్హుల వివరాలకు బ్యాంకర్ల కసరత్తు

ఐటీ పోర్టల్‌ను రూపొందించిన వ్యవసాయ శాఖ


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2018 డిసెంబరు 11 వరకు రైతులు పొందిన స్వల్పకాలిక రుణాలను (రూ.25 వేల లోపు ) ఒకే విడతలో ప్రభుత్వం మాఫీ చేయనుంది. బంగారం తాకట్టు పెట్టి రైతులు తీసుకున్న పంట రుణాలకూ మాఫీని వర్తింపజేయనుంది. రుణమాఫీ ప్రయోజనం రైతులకు అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక ఐటీ పోర్టల్‌ను రూపొందించింది. 


మెదక్‌ జిల్లాలో 13 వేల మంది

మెదక్‌, మే 8 : మెదక్‌ జిల్లాలో రుణమాఫీకి అర్హులను గుర్తించేందుకు పంచాయతీ సెక్రటరీ, వ్యవసాయ విస్తరణ అధికారి, వీఆర్వోలతో పాటు తహసీల్దార్‌, ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. రైతు కుటుంబ పెద్ద, సభ్యులను పరిగణలోకి తీసుకుంటారు. స్వల్పకాలిక పంటరుణాలు 18 నెలల చెల్లింపు కాల వ్యవధి ఉన్నవాటికి ఈ మాఫీ వర్తించనున్నట్లు సమాచారం. ఉద్యాన పంటల కోసం కూడా స్వల్ఫకాలిక రుణాలు పొందినవారికి రుణమాఫీ అందనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీకి సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రూ.25వేల లోపు రుణాలు పొందిన రైతులు మెదక్‌ జిల్లాలో 13 వేల వరకు ఉంటారని లీడ్‌బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు.


వీరికి రుణమాఫీ కోసం రూ.30 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఈ రుణ మాఫీని కుటుంబం యూనిట్‌గా భర్త, భార్య, వారి పిల్లలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు వివరించారు. మొదట రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ లాక్‌డౌన్‌ మూలంగా రైతుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు.


డబుల్‌ పేమెంట్లను అరికట్టేందుకు కమిటీ

కొందరు రైతులు వేర్వేరు బ్యాంకుల్లో పంట రుణాలు ఇదివరకే తీసుకొని ఉంటే డబుల్‌ పేమెంట్లను అరికట్టేందుకు ప్రభుత్వం మండలస్థాయిలో మండల బ్యాంకర్ల కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీ రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల వివరాలను పరిశీలిస్తోంది. నకిలీ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకొని ఉంటే వారిని అనర్హులుగా గుర్తిస్తారు. కొన్నిచోట్ల గ్రామాల్లో సేవలందిస్తున్న అర్బన్‌ మెట్రోపాలిటన్‌ బ్యాంకుల్లో రుణాలు పొందినవారికి మేనేజర్‌ అంగీకారం ప్రకారం రుణమాఫీ వర్తిస్తుంది. అనెక్సర్‌ ఏ, అనెక్సర్‌ బి నమూనాల్లో రైతుల జాబితా సమాచారాన్ని పొందుపర్చి బ్యాంకు మేనేజర్‌ సరిపోల్చుకున్నాకే మాఫీని వర్తింపజేస్తారు. ముందుగా ఈ వివరాలను లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌, జిల్లా కలెక్టర్‌కు పంపించాలని ప్రభుత్వం విడుదల చేసిన  మార్గదర్శకాల్లో పేర్కొంది.  


సిద్దిపేట జిల్లాలో 12,893 మంది అర్హులు

సిద్దిపేట జిల్లాకు సంబంధించి రూ.25 వేల లోపు రుణాలను తీసుకున్న రైతుల నివేదికను వ్యవసాయాధికారులు ఇప్పటికే అందజేశారు. జిల్లాకే చెందిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపించడంతో రైతుల జాబితాను వెంటనే సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,49,591 మంది రైతులు ఉండగా వీరిలో రూ.25 వేలలోపు రుణం తీసుకున్న రైతులు 12,893 మంది ఉన్నారు. తొలి విడతలో వారికి మాత్రమే మాఫీ జరుగుతుంది. కాగా జిల్లాలోని పలు బ్యాంకుల్లో రూ.1,083 కోట్ల వరకు రుణాలు తీసుకోగా నిబంధనల ప్రకారం లక్ష లోపు ఉన్నవారిని మాత్రమే గుర్తించారు. వీరి పేరిట రూ.983.51 కోట్ల రుణం ఉంది. దశలవారీగా ఇదంతా మాఫీ అవుతుంది. ప్రస్తుతం రూ.25 వేలలోపు ఉన్న 12,893 మంది రైతుల మాఫీకి సంబంధించి రూ.19.69 కోట్లు కేటాయించారు. 


రైతుల నివేదికను సమర్పించాం 

రైతులకు త్వరితగతిన రుణమాఫీ జరగాలనే ఉద్దేశంతో వివరాలను సిద్ధం చేసి అడిగిన వెంటనే ప్రభుత్వానికి సమర్పించామని సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌ తెలిపారు. మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు అర్హులైన రైతులందరినీ గుర్తించామని చెప్పారు. త్వరలోనే రుణం మాఫీ అవుతుందని, రైతులెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. దశలవారీగా మిగితా వారి రుణాలూ మాఫీ అవుతాయని చెప్పారు. 


సంగారెడ్డి జిల్లాలో బ్యాంకర్ల కసరత్తు

రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సీఎం కేసీఆర్‌ ఇప్పుడు రుణమాఫీ అమలు కోసం చర్యలు చేపట్టారు. తొలివిడతగా రూ.25 వేలు రుణాలు తీసుకున్న రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం రూ.1198 కోట్లను విడుదల చేసింది. అయితే తొలి విడతగా మాఫీ చేసే రూ.25 వేలలోపు రుణాలన్న రైతుల వివరాలు ఇప్పటికీ సంగారెడ్డి జిల్లా యంత్రాంగం వద్ద లేవు. సంగారెడ్డి జిల్లాల్లో రూ.25 వేల లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాల సేకరణకు లీడ్‌ బ్యాంక్‌ అధికారులు అన్ని బ్యాంకులకు నిర్ణీత ప్రొఫార్మను పంపించారు.


2018 డిసెంబరు నాటికి జిల్లా వ్యాప్తంగా 1,87,140 మంది రైతులు రూ.1667.49 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్టు లీడ్‌ బ్యాంక్‌ వద్ద సమాచారం ఉన్నది. అయితే ఇందులో రూ.25 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులు ఎందరన్నది తేలితేనే తొలివిడత రుణమాఫీ జరుగనుంది. ఈ వివరాల సేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత ప్రొఫార్మ ప్రకారం వివరాలను సిస్టమ్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు సర్వర్‌ తదితర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని బ్యాంకర్లు తెలిపారు. 


Updated Date - 2020-05-09T09:56:31+05:30 IST