మంబోజిపల్లి శివారులో సర్కారు భూమి కబ్జా !
ABN , First Publish Date - 2020-12-20T05:52:44+05:30 IST
సర్కారు భూమి కబ్జాకు గురవుతోంది..

తహసీల్దార్‌కు సర్పంచ్ ఫిర్యాదు
మెదక్ రూరల్, డిసెంబరు 19: సర్కారు భూమి కబ్జాకు గురవుతోంది.. రాళ్లు, రప్పలుగా ఉన్న గుట్టను చదును చేసి వాటాలుగా పంచుకుంటున్న బాగోతం మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామ శివారులో బయటపడింది. ఈ విషయమై సర్పంచ్, గ్రామస్థులు శనివారం రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మంబోజిపల్లి గ్రామ శివారులో 368 సర్వే నంబర్‌లో ఎన్‌ఎ్‌సఎ్‌ఫ భూములతో పాటు గ్రామానికి సమీపంలో ఉన్న మల్లన్న గుట్ట వద్ద కొంత భూమి ఉంది. ఇదంతా గుట్టగా ఉండటంతో ఇప్పటి వరకు ఎవరూ ఆ భూములపై కన్నేయలేదు. కానీ ఈ సర్వే నంబర్ భూములకు సమీపంలోనే మాచవరం గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన కొన్ని కుల సంఘాల నేతలు ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నిస్తున్నారు. సుమారు 20 ఎకరాల వరకు గుట్టను తవ్వి రాళ్లు రప్పలను తొలగిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మంబోజిపల్లి సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో కబ్జాకు గురవుతున్న భూములను పరిశీలించారు. సుమారు 20 ఎకరాల్లో భూమిని కబ్జా చేసినట్లు గుర్తించి పనులను నిలిపివేయించారు. మంబోజిపల్లి, మాచవరం గ్రామాలు ర్యాల మడుగు పంచాయతీలో ఉన్నప్పుడు 368 సర్వే నంబర్ భూములు తమ గ్రామానికి 1994లో కేటాయించారని మంబోజిపల్లి గ్రామస్థులు తెలిపారు. వెంటనే రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని కోరారు.