ఘణపురం ఆనకట్ట..ఇకపై వనదుర్గప్రాజెక్టు

ABN , First Publish Date - 2020-08-12T10:59:43+05:30 IST

మెదక్‌ జిల్లాలోని ఘణపురం ఆనకట్ట పేరు మారనుంది. ఇకపై వనదుర్గ ప్రాజెక్టుగా పిలవనున్నారు.

ఘణపురం ఆనకట్ట..ఇకపై వనదుర్గప్రాజెక్టు

పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం

మంజీరా నదిపై నిజాం కాలంలో నిర్మాణం

ఉమ్మడి జిల్లాలో తొలి మధ్య తరహా ప్రాజెక్టు

ప్రత్యేక రాష్ట్రంలో ఎత్తు పెంపునకు నిధులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఆగస్టు 11: మెదక్‌ జిల్లాలోని ఘణపురం ఆనకట్ట పేరు మారనుంది. ఇకపై వనదుర్గ ప్రాజెక్టుగా పిలవనున్నారు. ఈ మేరకు  రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో పుట్టి.. కర్ణాటక మీదుగా ప్రవహించి.. మెతుకు సీమను సస్యశ్యామలంచేసే మంజీరా నదిపై ఉమ్మడి జిల్లాలో నిర్మించిన తొలి జలాశయం ఘణపురం ఆనకట్ట. నిజాం కాలంలో నిర్మించిన ఈ మధ్యతరహా ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఆనకట్ట ఎత్తు పెంపునకు నిధులు మంజూరయ్యాయి. ఆనకట్టను దాటుకుని ఏడుపాయలుగా భక్తుల ఇలవేల్పు వనదుర్గాభవానీమాత పాదాల చెంత పరవళ్లు తొక్కుతూ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టుకు వనదుర్గ ప్రాజెక్టుగా నామకరణం చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


115 ఏళ్ల చరిత్రకు నిదర్శనం

మెతుకు సీమ వరుస కాటకాలతో తల్లడిల్లుతున్న తరుణంలో ప్రజల కష్టాలు తీర్చేందుకు 1890 దశకంలో మంజీరా నదిపై ఘణపురం ఆనకట్ట నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రూ.26 లక్షల వ్యయంతో 0.2 టీఎంసీల సామర్థ్యంతో మెదక్‌ జిల్లాలోని కొల్చారం మండలం ఘణపుర్‌ గ్రామ పరిధిలో 1899 అక్టోబరు 3న ప్రాజెక్టు నిర్మాణానికి పనులు ప్రారంభించారు. నిజాం పాలకుడు బహదూర్‌ యామిన్‌ ఆజ్‌ సుల్తాన్‌ ఘణపురం ప్రాజెక్టును 1905లో ప్రారంభించారు. గోదావరి ఉపనది మంజీరా నదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు ఇదే. మహారాష్ట్రలోని బీడ్‌ జల్లా పటోడా తాలుకాలోని బాలాఘాట్‌ పర్వతి శ్రేణిలో ఉత్తరపు అంచుల్లో 823 మీటర్ల ఎత్తున మంజీరా నది జన్మిస్తుంది. కర్ణాటక మీదుగా ప్రవహించి మనూర్‌ మండలంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోకి అడుగుపెడుతుంది. నిజామాబాద్‌ జిల్లాలో గోదావరిలో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే పొలాలకు నీరందించేందుకు కుడి కాలువ (మహబూబ్‌ నహర్‌)ను నిర్మించారు.


అనంతరం ఈ ప్రాజెక్టు ఆయకట్టు పెంచేందుకు నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ ఎడమ కాలువ (ఫతే నహర్‌)ను నిర్మించాడు. ఘణపూర్‌ ఆనకట్ట ప్రస్తుత ఆయకట్టు సుమారు 30 వేల ఎకరాలు. కొల్చారం, పాపన్నపేట, మెదక్‌, హవేళీఘణపూర్‌ మండలాలను ఈ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనకట్ట నిర్వహణను సర్కారు పూర్తిగా గాలికి వదిలేయడంతో ప్రాజెక్టు కళ కోల్పోయింది. మంజీరా వద్ద సింగూరు వద్ద ప్రాజెక్టును నిర్మించడంతో.. ఆ జలాశయం నిండిన అనంతరమే ఘణపూర్‌కు నీరు వదులుతున్నారు. ఇక్కడి నుంచి పోచారం మీదుగా నిజాంసాగర్‌కు నీరు చేరుతుంది. తెలంగాణ అవతరణ అనంతరం సీఎం కేసీఆర్‌ 2014 డిసెంబరు 17న మెదక్‌లో పర్యటించిన సందర్భంగా ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. కానీ రెండేళ్లుగా మంజీరాకు వరద రాకపోవడంతో ఆయకట్టుకు నీరందడం లేదు.

Updated Date - 2020-08-12T10:59:43+05:30 IST