నర్సాపూర్‌పై వరుణుడి దయ కరువు

ABN , First Publish Date - 2020-07-27T20:01:43+05:30 IST

జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా నర్సాపూర్‌ మండలంలో మాత్రం చినుకు జాడ లేదు. డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల్లో చెరువులు, కుంటల్లో నీరు చేరినా.. నర్సాపూర్‌ మండలంలో

నర్సాపూర్‌పై వరుణుడి దయ కరువు

అంతటా వర్షాలు పడుతున్నా ఇక్కడ అంతంతమాత్రమే

కనీస వర్షపాతం కంటే తక్కువగా నమోదు 

ఆందోళనలో రైతులు.. తాగునీటికీ తిప్పలు


నర్సాపూర్‌(ఆంధ్రజ్యోతి): జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా నర్సాపూర్‌ మండలంలో మాత్రం చినుకు జాడ లేదు. డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల్లో చెరువులు, కుంటల్లో నీరు చేరినా.. నర్సాపూర్‌ మండలంలో మాత్రం ఒక్క చెరువులోకి నీరు రాలేదు. వర్షాకాలం రెండు నెలలు గడిచినా సరైన వర్షాలు లేక నర్సాపూర్‌ పట్టణంతో గ్రామాల్లోనూ తాగడానికి తిప్పలు తప్పడం లేదు. నర్సాపూర్‌ పట్టణ పరిధిలో ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మండలంలో రైతులు దుక్కులను సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. నాట్లు ఆలస్యం కావడంతో చాలాచోట్ల వరి తుకం ముదిరిపోతున్నది. అంతటా వర్షాలు పడుతున్నా తమపైనే వరుణుడికి దయ రావడం లేదని ప్రజలు నిట్టూర్చుతున్నారు. 


సాధారణం కంటే తక్కువే..

మండలంలో వర్షాకాలం ప్రారంభంలో జూన్‌ నెలలో మొదటి పది రోజులు మాత్రమే సాధారణ వర్షపాతం (119 మిల్లీమీటర్లు) నమోదైంది. ఇదే సమయంలో డివిజన్‌ పరిధిలోని శివ్వంపేట మండలంలో 187 మిల్లీమీటర్లు, కౌడిపల్లి మండలంలో 269.2 మిల్లీమీటర్లు, కొల్చారంలో 256.1 మిల్లీమీటర్లు, చిల్‌పచెడ్‌లో 242.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో మరింత ఎక్కువ వర్షాలు పడాల్సి ఉండగా మండలంలో నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే స్వలంగా వర్షాలు కురిసాయి. జూలై 3న 10.8 మి.మీ., 4న 11.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తరువాత పది రోజుల వరకు చినుకు కురియలేదు. 15వ తేదీన అతిస్వల్పంగా 2.4 మి.మీ., 16వ తేదీన 56.2 మి.మీ., 21న 4.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇదే సమయంలో డివిజన్‌ పరిధిలోని ఇతర మండలాల్లో పుష్కలంగా వానలు పడి చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. 


వర్షాకాలంలోనూ తాగునీటి కటకట

మండలంలో ఇప్పటికీ చెరువులు, కుంటలు బోసిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఇప్పటికీ నీటి కటకట తప్పడం లేదు. నర్సాపూర్‌ పట్టణంలో ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో సైతం నీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. రెండు నెలలైనా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారాల్సి ఉండగా.. చుక్క నీరు రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లలో నీరు రోజురోజుకూ తగ్గుతుండడంతో నాట్లు ఆలస్యమవుతున్నాయి. సిద్ధం చేసుకున్న నారు మడులు ముదిరిపోతున్నాయి. ఏంచేయాలో తెలియక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. 

Updated Date - 2020-07-27T20:01:43+05:30 IST