సాయం కోసం..
ABN , First Publish Date - 2020-12-05T05:30:00+05:30 IST
రైతులకు అందించే రైతుబంధు పథకంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఎదురు చూస్తున్న 2.78లక్షల మంది రైతులు
వానాకాలంలో పంటనష్టపోయి ఆర్థికంగా దెబ్బతిన్న రైతులు
యాసంగి ప్రారంభమైనా అందని పెట్టుబడి
ప్రభుత్వం అందించే రైతుబంధుపైనే ఆశలు
సిద్దిపేట అగ్రికల్చర్, డిసెంబరు 5: యాసంగి సాగు ప్రారంభమైనా రైతులకు నేటికి రైతుబంధు అందలేదు. ఇప్పటికే పలుచోట్ల నారు పోసుకుని సాగుకు పొలాలను సిద్ధం చేసుకున్నారు. రైతులకు అందించే రైతుబంధు పథకంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. వానకాలంలో సాగు చేసిన పంటలు అకాల వర్షానికి తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి. యాసంగి సాగుకు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే రైతుబంధుపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి.
వానాకాలంలో రూ.310.84 కోట్లు కేటాయింపు
వానాకాలం సాగుకు జిల్లాలోని 2,77,630 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరికి పెట్టుబడి సాయం కింద రూ.310.84 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వివిధ కారణాలతో మిగిలిన 12,957 మంది రైతులకు నగదు జమ కాలేదు. ఏటా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతుల వివరాలను వ్యవసాయ విస్తరణ శాఖ అధికారులు రైతుబంధు పథకానికి అర్హులుగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో ఎకరాకు రూ.5వేల చొప్పున ట్రెజరీ ద్వారా జమ చేస్తుంది. యాసంగి సీజన్‌లో 2.78 లక్షల మంది అర్హులైన రైతులను అధికారులు గుర్తించారు.
వడ్డీ వ్యాపారులే దిక్కు
వానాకాలంలో అధిక వర్షాల కారణంగా సాగుచేసిన పంటలన్నీ దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటల సాగు కోసం పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పెట్టుబడి సహాయాన్ని అందించకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైతులకు మరింతి ఆర్థిక భారం కానుంది.
యాసంగిలో 2.76 లక్షల ఎకరాల్లో సాగు
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో పంటలకు నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అక్టోబరు రెండో వారం నుంచే రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. 2.76 లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ, పెసర, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేందుకు జిల్లా రైతాంగం నిమగ్నమయ్యారు. పంటల సాగుకు ముందే పెట్టుబడి సహాయం అందిస్తే విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
