పనుల్లో నాణ్యత లేకుంటే జరిమానా

ABN , First Publish Date - 2020-12-13T05:56:50+05:30 IST

రోడ్ల నిర్మాణం పనుల్లో నాణ్యత లోపం ఉన్నట్టు తేలితే సదరు కాంట్రాక్టర్‌కు జరిమానా విధిస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌, సంగారెడ్డి మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ రాజర్షిషా హెచ్చరించారు.

పనుల్లో నాణ్యత లేకుంటే జరిమానా
సంగారెడ్డిలోని రాజంపేట ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి

అదనపు కలెక్టర్‌ రాజర్షిషా హెచ్చరిక


సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 12  : రోడ్ల నిర్మాణం పనుల్లో నాణ్యత లోపం ఉన్నట్టు తేలితే సదరు కాంట్రాక్టర్‌కు జరిమానా విధిస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌, సంగారెడ్డి మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ రాజర్షిషా హెచ్చరించారు. సంగారెడ్డిలోని పాత బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బసవేశ్వర ఆలయం వరకు ఇటీవల వేసిన బీటీ రోడ్డు నాసిరకంగా ఉన్నదని పలువురు ఫిర్యాదు చేయడంతో శనివారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి రవితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా మాట్లాడుతూ పట్టణంలో వేస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులకు సూచించారు. నాణ్యతను పాటించకుంటే జరిమానా వేయాలని, క్వాలిటీ కంట్రోల్‌ నుంచి తుది నివేదిక వచ్చిన తర్వాతే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. 


ఇన్‌టెక్‌వెల్‌, ఫిల్టర్‌బెడ్‌ పరిశీలన

మంజీరా రిజర్వాయర్‌ నిండడంతో సంగారెడ్డి పట్టణానికి ప్రతిరోజు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. ఈ మేరకు కలబ్‌గూర్‌ శివారులోని మంజీరా జలాశయం వద్ద ఉన్న ఇన్‌టెక్‌వెల్‌, రాజంపేటలోని ఫిల్టర్‌బెడ్‌లలో జరుగుతున్న మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. పట్టణంలోని ఇంటింటికీ త్వరలో మంజీరా నీటిని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఇన్‌టెక్‌వెల్‌ ఫిల్టర్‌బెడ్‌లో పంపుసెట్లు, మోటార్లు, పైప్‌లైన్‌ల మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, డీఈ ఇంతియాజ్‌ అహ్మద్‌, ఏఈ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు నాయికోటి రమేశ్‌, అశ్విన్‌, ఆరీఫ్‌, మాజీ కౌన్సిలర్‌ బొంగుల రవి, సీడీసీ మాజీ చైర్మన్‌ శంకరి విజయేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు బత్తుల శ్రీనివాస్‌, నర్సింహులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-13T05:56:50+05:30 IST