సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

ABN , First Publish Date - 2020-10-07T06:52:13+05:30 IST

ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట కరెంటు సరఫరాలో అంతరాయం వల్ల ఎండిపోతుండడంతో అల్లాదుర్గం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మంగళవారం అన్నదాతలు ముట్టడించారు. సమస్య పరిష్కరిస్తారా?

సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

పెట్రోలు డబ్బాలతో ఆందోళన


అల్లాదుర్గం, అక్టోబరు 6 : ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట కరెంటు సరఫరాలో అంతరాయం వల్ల ఎండిపోతుండడంతో అల్లాదుర్గం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మంగళవారం  అన్నదాతలు ముట్టడించారు. సమస్య పరిష్కరిస్తారా? చావమంటారా? అని పెట్రోల్‌ డబ్బాలతో బైఠాయించారు.  పట్టణంలోని కొచ్చెర్వు కట్ట వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి 25 వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ సరఫరా అవుతోంది. వారం రోజులుగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో చేతికొచ్చిన వరి ఎండిపోతున్నది. ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోయిందని, మరమ్మతులు చేయమని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. వెంట పెట్రోల్‌ సీసాలు, డబ్బాలు కూడా తీసుకువచ్చారు.


పంట చేతికందే సమయానికి ఎండుతోందని, ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే బాగుచేయకపోతే పెట్రోల్‌ పోసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మోహన్‌రెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులను సముదాయించారు. ట్రాన్స్‌ కో అధికారులతో చర్చించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను తక్షణమే బాగుచేయిస్తామని ట్రాన్స్‌కో ఏఈ రాంబాబు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Updated Date - 2020-10-07T06:52:13+05:30 IST