అన్నదాతకు అంతులేని కష్టం

ABN , First Publish Date - 2020-09-29T07:27:47+05:30 IST

అన్నదాతకు అంతులేని కష్టం

అన్నదాతకు అంతులేని కష్టం

నష్టంపై అధికారుల అంచనాలు నామమాత్రం 

సిద్దిపేట జిల్లాలో 15వేల ఎకరాల్లోనే దెబ్బతిన్నట్లు నివేదిక

వరి, పత్తి పంటలకు భారీగా దెబ్బ

కుంటలను తలపిస్తున్న పొలాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు 28 : ‘సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన గడెగోని మల్లేశం ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. సుమారు రూ.లక్షపైనే పెట్టుబడి పెట్టాడు. పూత, కాత కూడా వృద్ధి చెందాయి. అంతా బాగానే ఉందనుకునే తరుణంలో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. తన ఆశలన్నీ అడియాశలయ్యాయి. మూడు రోజులుగా పత్తి చేలు నీళ్లలోనే ఉండడంతో మొక్కలన్నీ ఎర్రబారాయి. పూత, కాత దక్కలేదు. పెట్టుబడి డబ్బు కూడా వచ్చే పరిస్థితి లేదని బోరుమంటున్నాడు’


మల్లేశం కన్నీటిగాథలాంటిదే ఇప్పుడు జిల్లాలో వేలాది మంది రైతులది. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షానికి ఆగమాగమైందని ఆవేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మందికి పైగానే రైతులు పంటలను కోల్పోయి ఆదుకోవాలని కోరుతున్నారు. 


నామమాత్ర నివేదిక

సిద్దిపేట జిల్లాలో ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు జిల్లాలోని సుమారు 4 వేల మందికి చెందిన 8 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇక తాజాగా కురిసిన వర్షాలకూ మరో 6,500 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు గుర్తించారు. అయితే ఇది నామమాత్రపు సర్వే అని అవగతమవుతున్నది. ఎందుకంటే భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన మద్దూరు, హుస్నాబాద్‌, అక్కన్నపేట లాంటి మండలాల ప్రస్తావనను తాజా నివేదికలో పొందుపర్చలేదు. 


ఎర్రబారిన తెల్లబంగారం

ప్రస్తుతం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 2,41,621 ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నారు. గత ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు పత్తి చేలల్లో నీళ్లు నిలిచాయి. తిరిగి కోలుకునే సమయంలో మళ్లీ వర్షాలు పడడంతో పాత పరిస్థితే దాపురించింది. ఈ వర్షాలకు పూత, కాత కూడా రాలిపోయింది. మరో 20 రోజుల తర్వాత పత్తి ఉత్పత్తి అయ్యే దశకు చేరింది. ఇంతలోనే పెనుముప్పు వాటిల్లింది. మొత్తంగా 30వేల ఎకరాలకుపైగానే వరద నీటితో నష్టపోయినట్లు తెలుస్తున్నది. ఈసారి మొక్కజొన్నకు బదులు చాలామంది రైతులు పత్తిపై ఆసక్తి చూపగా వరుణుడి రూపంలో బెడిసికొట్టింది. 


నష్టపరిహారంపై స్పందన కరువు

వర్షాలకు నష్టపోయిన పంటల గురించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు జిల్లాలో భారీ వర్షాలకు పంటలు నష్టపోయాయి. స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు నష్టంపై తాత్కాలికంగా ఒక అంచనా వేస్తున్నారు. గతంలో ఇలాగే నష్టపోయిన పంటలకు కొంత ఆలస్యంగానైనా పరిహారం అందజేశారు. ఈసారి మాత్రం అలాంటి ఊసే లేదు. కాగా 15 వేల ఎకరాల వరకు అధికారులు అంచనా వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో రెట్టింపయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 


పెట్టుబడి అంతా వర్షార్పణం  

నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఇప్పటివరకు అప్పు తీసుకొచ్చి రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఈ వర్షాలకు పంట దెబ్బతిన్నది. పూత పూర్తిగా రాలిపోయి ఎర్రగా మారింది. చెట్టుకు కనీసం నాలుగు కాయలు కూడా లేవు. ఈసారి పెట్టుబడి అంతా నీటి పాలైంది. వర్షంతో మాకు గుండెకోత మిగిలింది. 

-నారాయణ, పత్తిరైతు, అంతక్కపేట


చేనంతా నీళ్ల పాలైంది

ఈసారి కాలం మంచిగుందని సంబరపడ్డం. మూడెకరాల్లో వేసిన పత్తి ఏపుగా పెరిగిందని మురిసినం. ఇంతలోనే పాడువాన మా చేనంతా కరాబు చేసింది. 50వేల రూపాయలు నీళ్లపాలైనయి. సర్కారోళ్లే మమ్ములను ఆదుకోవాలి. ఇప్పటికే అప్పులు తెచ్చిపెట్టినం. పెట్టుబడి వచ్చేట్లయినా పరిహారం అందించాలె. 

- తుల్జారం రాజయ్య, సలాఖ్‌పూర్‌


నీళ్లు నిల్వకుండా చూడాలి-శ్రవణ్‌, జిల్లా వ్యవసాయాధికారి

ఈ వర్షాలకు వరిపొలాల్లో నీళ్లు చేరినప్పటికీ మళ్లీ కోలుకుంటాయి. ఇసుకమేటలు ఉంటే కొంత నష్టం ఉంటుంది. పత్తి చేన్లలో నీళ్లు చేరితే ఎర్రబారతాయి. అందుకే నీటిని బయటకు పంపేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మల్టీ-కే అనే మందుతో పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. ఇంతవరకు యూరియా, పొటాష్‌ వేయకుంటే ఒక దఫా వేస్తే పచ్చదనంతోపాటు ఎదుగుదల కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న మా వ్యవసాయశాఖ అధికారుల సలహాలను తీసుకోవాలి. 


పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనా

మండలం ఎకరాలు

సిద్దిపేట అర్బన్‌ 502 

సిద్దిపేట రూరల్‌ 737

కోహెడ 41

కొమురవెల్లి 60

చేర్యాల 92

వర్గల్‌ 180

మర్కూక్‌ 452

గజ్వేల్‌ 3,315

నంగునూరు 848 


రెండు రోజుల వర్షాలకే 19,982 ఎకరాల్లో పంట నష్టం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/కల్హేర్‌ : రెండు రోజుల్లో కురిసిన వర్షానికే సంగారెడ్డి జిల్లా మొత్తం మీద 19,982 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 13,669 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఈ నెల 26న జిల్లా సగటున 56.8 మి.మీ.ల వర్షం కురియగా, 27న 21.8 మి.మీ.ల వర్షం కురిసింది. ఈ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 12,072 ఎకరాలలో పంటలు నీట మునిగి దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన సర్వేలో వెల్లడైంది. ఈ పంటలన్ని సదాశివపేట, కొండాపూర్‌, పటాన్‌చెరు, జహీరాబాద్‌, కోహీర్‌, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి, కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో పత్తి, సోయాబీన్‌ పంటలు దెబ్బతిన్నట్టు సర్వేలో తేలింది. జిల్లాలో సోయాబీన్‌ పంటకు ఎక్కువ విస్తీర్ణంలో నష్టం వాటిల్లింది. ఒక్క సోయా పంటనే 17.171 ఎకరాల్లో దెబ్బతినగా, పత్తి పంట 2577 ఎకరాల్లో, కందులు 46 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. మొత్తం మీద ఈ రెండు రోజుల్లో జరిగిన పంట నష్టం విలువ సుమారు రూ.29.97 కోట్లు ఉంటుందని రైతు సంఘాలు అంచనా వేశాయి. జిల్లాలోని కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లోనే భారీగా పంట నష్టం జరిగింది. ఈ మేరకు సోమవారం వ్యవసాయ అధికారి శశాంక్‌ ఆధ్వర్యంలో పంటల నష్టాన్ని అంచనా వేశారు. ఈ రెండు మండలాల్లో 7,910 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. కల్హేర్‌ మండలంలో 5,546 ఎకరాల్లో నష్టం వాటిళ్లగా ఇందులో అత్యధికంగా సోయాబీన్‌ 2,160 ఎకరాల్లో దెబ్బతిన్నది. సిర్గాపూర్‌ మండలంలో 2,364 ఎకరాల్లో పంట నష్టానికి గురి కాగా ఎక్కువగా  పత్తి  988 ఎకరాల్లో, పెసర 950 ఎకరాల్లో దెబ్బతిన్నది. 

Updated Date - 2020-09-29T07:27:47+05:30 IST