అప్పుల బాధకు కుటుంబం బలి

ABN , First Publish Date - 2020-12-11T05:31:40+05:30 IST

అప్పుల బాధతో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి వారితో పాటు 11 ఏళ్ల కొడుకు బలయ్యాడు. తల్లిదండ్రులే కొడుకుకు పురుగుమందు తాగించి ప్రాణాలు తీశారు.

అప్పుల బాధకు కుటుంబం బలి
తల్లి దండ్రులతో మోక్షాజ్ఞ(ఫైల్‌)

 మృత్యువుతో పోరాడి ఓడిన కుమారుడు 


హుస్నాబాద్‌/కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 10: అప్పుల బాధతో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి వారితో పాటు 11 ఏళ్ల కొడుకు బలయ్యాడు. తల్లిదండ్రులే కొడుకుకు పురుగుమందు తాగించి ప్రాణాలు తీశారు. హుస్నాబాద్‌కు చెందిన అందె సమ్మయ్య(40), కృష్ణవేణి(32) దంపతులు. అప్పుల బాధ భరించలేక ఈ నెల 6న అర్ధరాత్రి సమయంలో కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో అద్దె ఇంటిలో గడ్డి మందును తాగి, బలవంతంగా వారి కొడుకు మోక్షజ్ఞ(11)కు  తాగించి, అతడి చెవిలో పోశారు. సమ్మయ్య, కృష్ణవేణి 7వ తేదీన కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా మోక్షజ్ఞను కరీంనగర్‌ ఆస్పత్రి నుంచి ఈ నెల 9న వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు. కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా తనకు పురుగుల మందు తాగించారని, చెవిలో పోశారని పోలీసులతో మోక్షజ్ఞ తెలిపినట్లు సమాచారం. కాగా భార్య, కొడుకు, కోడలు, మనవడు మరణించడంతో సమ్మయ్య తండ్రి వెంకటయ్య(80) ఒంటరివాడయ్యాడు. కొన్ని రోజుల కిందటే సమ్మయ్య తండ్రి వద్దకు వచ్చి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్లాడు. ఆ తరువాత ప్రాణాలు తీసుకోవడంతో వెంకటయ్య రోదన ఆపటం ఎవరితరం కావటం లేదు. 


Updated Date - 2020-12-11T05:31:40+05:30 IST