వేపచెట్టుకు నీళ్లు పోస్తే కరోనా రాదట!
ABN , First Publish Date - 2020-03-25T13:34:09+05:30 IST
ఒక్కరూ, ఇద్దరు కొడుకులు ఉన్న మహిళలు వేప చెట్టుకు నీరు పోస్తే, వారి పిల్లలకు కరోనా దరిచేరదని వదంతులు చక్కర్లు కొడుతున్న సంఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో చోటు చేసుకుంది.

- ఇద్దరు కొడుకులున్న తల్లుల మూఢ నమ్మకం
- భయంతో గడపలు కడిగి, దీపాలు పెట్టిన తల్లులు
(మెదక్ కల్చరల్/చేగుంట/ చిల్‌పచేడ్/వెల్దుర్తి/ చిన్నశంకరంపేట/చేర్యాల/దుబ్బాక/మద్దూరు/ నారాయణఖేడ్): ఒక్కరూ, ఇద్దరు కొడుకులు ఉన్న మహిళలు వేప చెట్టుకు నీరు పోస్తే, వారి పిల్లలకు కరోనా దరిచేరదని వదంతులు చక్కర్లు కొడుతున్న సంఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో చోటు చేసుకుంది. ఈ నెల అమావాస్య మంచిగా వస్తలేదని, వేప చెట్టుకు నీరు పోస్తే కరోనా వైరస్ వ్యాపించదని వదంతులు రావడంతో గ్రామాల్లో ఒక్క కొడుకు, ఇద్దరు కొడుకులు ఉన్న మహిళలు ఐదు మంది దగ్గర నుంచి నీళ్లు అడుక్కుని వచ్చి సోమవారం అర్ధరాత్రి వరకు వేప చెట్టుకు పోశారు. అంతేకాకుండా ఇంట్లో దీపాలను వెలిగించారు. మెదక్ జిల్లాలోని చిల్‌పచెడ్ మండల పరిధిలో, చేగుంట మండలం వడియారం, వెల్దుర్తి మండలం మాసాయిపేట, బండపోసాన్‌పల్లిలో, చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి, గజగట్లపల్లి, చందంపేట, మడూర్‌లో, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల, వీరన్నపేటలో, కొమురవెల్లి మండలం తపాస్ పల్లిలో, దుబ్బాక మండలంలో, మద్దూరు మండలం రేబర్తిలో, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్‌రావుపేటతో సహా పలు గ్రామాల్లో ఐదు ఇంటి గడపలు కడగాలని, కరోనా మీ పిల్లల దరిచేరదని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆ మూఢనమ్మకాలను నమ్మిన మహిళలు గ్రామాల్లో ఐదు ఇళ్ల గడపలు కడిగిన ఆ నీటితో వేప చెట్టుకు పూజలు చేశారు. కాగా కొన్ని గ్రామాల్లో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో మూఢనమ్మకాలను, సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి అక్కడి నుంచి మహిళలను పంపివేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలు పాటించడం ఏమిటని పలువురు ఎద్దేవాచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కరోనా వైర్‌సను తరిమి కొట్టేందుకు లాక్‌డౌన్ నిర్వహించగా మూఢనమ్మకాలు ముసుగులో ప్రజలు, మహిళలు, రోడ్లు ఎక్కడం, ఇతరుల ఇళ్లలోకి వెళ్లి వారి గడపలను కడగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వదంతులను నమ్మొద్దు
ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దు. సమూహాలుగా తిరిగితే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల ప్రకారం నడుచుకోవాలి. స్వీయ నిర్బంధంతో పాటు పరిశుభ్రత పాటించాలి. ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ప్రాణాంతక వైర్‌సను కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరించాలి.
-డాక్టర్ పి.సురేష్, మెదక్
కరోనా వైరస్ నిరోధానికి మందు లేదు
‘ప్రపంచమంతా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో దాని నివారణకు మూఢనమ్మకాలను కొందరు ప్రచారం చేస్తున్నారు. ఒక్కో కొడుకున్న తల్లులు ఇద్దరు కొడుకులున్న తల్లుల వద్దకు వెళ్లి చెంబులతో నీళ్లుతెచ్చి వేపచెట్టుకు పోస్తే కరోనా వైరస్ నాశనమవుతుందని ప్రచారం చేస్తున్నారు. స్వీయ నిర్బంధం చేసుకునే ఈ తరుణంలో చెంబుల ద్వారా నీళ్లు బదులు తెచ్చుకుంటే చేతులు మారి కరోనా మరింత ప్రబలే ప్రమాదముంది. మూఢనమ్మకాలకు ఆస్కారం లేకుండా శాస్త్రీయ దృక్పథంతో వ్యహరించాలి. వైరస్ నిర్మూలనకు ఎలాంటి చిట్కాలు, మందులు లేవు.
-నాగభూషణం, జనవిజ్ఞాన వేదిక, మెదక్ జిల్లా గౌరవాధ్యక్షుడు