సహకార సంఘాల్లో నిధులు స్వాహా

ABN , First Publish Date - 2020-03-12T08:36:49+05:30 IST

రైతుల అభ్యున్నతికి కృషి చేయాల్సిన సహకార సంఘాల్లో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు

సహకార సంఘాల్లో నిధులు స్వాహా

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మార్చి 11: రైతుల అభ్యున్నతికి కృషి చేయాల్సిన సహకార సంఘాల్లో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధగా సొసైటీ సొమ్మును యథేచ్ఛగా సొంతానికి వాడుకుంటున్నారు. లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతున్నా, అవేవీ వెలుగుచూడడం లేదు. ఆడిటింగ్‌లోనూ అక్రమాలు వెలుగుచూడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏళ్ల తరబడిగా ఈ తంతు సాగుతున్నా పట్టించుకున్న నాథుడు లేరు. దాంతో అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. మామూళ్లకు అలవాటుపడిన అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తే అవకతవకలు బయటపడే అవకాశాలున్నాయి.

సంఘం డబ్బు సొంతానికి...

మెదక్‌ జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌) ఉన్నాయి. పలు సంఘాల్లో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. ఎరువులు, విత్తనాల విక్రయం, ధాన్యం కొనుగోళ్లతో వచ్చిన కమీషన్లతో సంఘాలకు ఆదాయం పెరిగింది. అయితే ఆ మేర సంఘ సభ్యులకు ప్రయోజనం చేకూరడం లేదు. దీంతో కొందరు ఆ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు, నాయకులతో కుమ్మక్కవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కార్యకలాపాలతో వచ్చిన లాభాలను సొసైటీ లెక్కల్లో చూపకుండా స్వాహా చేస్తున్నారు. పలు చోట్ల సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లపైనా తీవ్ర ఆరోపణలున్నాయి.


అయినా అధికారులు మాత్రం చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు ఉండడం కూడా ఇందుకు ఓ కారణం. జిల్లాలోని చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌ సొసైటీలో రూ.6.50 లక్షలను పాలకవర్గంలోని ఓ నాయకుడు సొంతానికి వినియోగించుకున్నట్లు సమాచారం. తాను సంఘానికి బకాయిపడిన మొత్తాన్ని ఎరువులను విక్రయించడంతో వచ్చిన మొత్తంతో చెల్లించినట్లు తెలుస్తోంది. అదే సంఘంలో గతంలోనూ రూ.5 లక్షలకుపైగా దుర్వినియోగం జరిగింది. ఆ తర్వాత రికవరీ చేశారు. అదే మండలంలోని రెడ్డిపల్లి సొసైటీలోనూ రూ.2లక్షలకు పైగా, నార్సింగిలో రూ.6 లక్షల వరకు ఇదే తరహాలో వాడుకున్నారు. చిల్‌పచెడ్‌ మండలం సోమక్కపేటలో సొసైటీకి చెందిన స్థలాన్ని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అద్దెకిచ్చారు. అద్దెల రూపంలో వచ్చిన సుమారు రూ.3లక్షల డబ్బును సంఘం ఖాతాలో జమ చేయకుండా స్వాహా చేసినట్లు సమాచారం. సొసైటీ స్థలాన్ని అద్దెకిస్తున్నట్లు కనీసం రికార్డుల్లో కూడా చూపకపోవడం గమనార్హం. చేగుంట, రామాయంపేట, తూప్రాన్‌ సంఘాలపైనా ఇవే తరహా ఆరోపణలున్నాయి.


మార్క్‌ఫెడ్‌ నుంచి ఎరువులను సంఘాలు కొనుగోలు చేసి రైతులకు అమ్ముతుంటాయి. తద్వారా లాభాలను అర్జిస్తుంటాయి. అయితే సంఘాల్లో వివిధ పదవుల్లో కొనసాగుతున్న నేతలు డబ్బును సొంతానికి వాడుకుంటున్నారు. దాంతో సొసైటీలు మార్క్‌ఫెడ్‌కు బకాయి పడిపోతున్నాయి. ఒత్తిడి చేస్తే ఎన్నో కొన్ని తెచ్చి ఇస్తున్నారు. మరికొందరైతే ఏకంగా సంఘాల్లో ఉన్న ఎరువుల నిల్వలనే విక్రయించి సొంత బకాయులు చెల్లించారణే ఆరోపణలున్నాయి. సంఘాల పనితీరు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో డీసీవో, క్లస్టర్‌ స్థాయిలో అసిస్టెంట్‌ రిజిస్టార్లు, సీనియర్‌, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.


ఏటా సంఘాల ఆడిటింగ్‌లో అవకతవకలను గుర్తించి దుర్వినియోగమైన సొమ్మును బాధ్యుల నుంచి రికవరీ చేయాలి. ఉన్నతాధికారులు ఈ విషయంపై నివేదిక ఇవ్వాలి. ఆడిటర్లను ప్రలోభపెడుతుండడంతో అంతా బాగుందంటూ సంతకాలు చేసేస్తున్నారు. దాంతో అక్రమాలు మరుగునపడిపోతున్నాయి. ఏళ్ల తరబడిగా ఇదే తంతు చాలా చోట్ల కొనసాగుతోంది. అయితే క్లస్టర్ల స్థాయిలో పర్యవేక్షణ చేసే అధికారులు, ఇతర సిబ్బంది కూడా ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తుండడంతో పర్యవేక్షణ లోపం ఏర్పడుతోంది.

చర్యలు తీసుకుంటాం: పద్మ, డీసీవో

సహకార సంఘాల్లో ఏటా ఆడిటింగ్‌ జరుగుతోంది. సొసైటీ డబ్బు ఎక్కడైనా దుర్వినియోగమైతే ఆడిటింగ్‌లో తేలుతుంది. సంఘాలకు సంబంధించిన డబ్బు సొంతానికి వాడుకున్నట్లు నా దృష్టికి రాలేదు. అలాంటివి ఉంటే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2020-03-12T08:36:49+05:30 IST