ఎదురుచూపులు!

ABN , First Publish Date - 2020-11-20T05:27:06+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సిద్దిపేట జిల్లా ముందు వరుసలో ఉంటుంది.

ఎదురుచూపులు!
రిజిస్ర్టేషన్ల ఆఖరి రోజు(సెప్టెంబరు 7)న సిద్దిపేట సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో సందడి

 రిజిస్ర్టేషన్‌ ఆఫీసుల్లో స్థబ్దత

 వ్యవసాయేతర భూములపై వీడని సందిగ్ధత

 స్థలాల మార్కెట్‌ ధరలపై సర్కారుకు నివేదిక

 ఈనెల 23న రిజిస్ర్టేషన్లు ప్రారంభమయ్యేనా?

 స్టాంప్‌ పేపర్లకూ తీవ్రమైన కొరత

 బ్లాకులో విక్రయిస్తున్న వైనం

 పెండింగ్‌ పడుతున్న అగ్రిమెంట్లు


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 19: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సిద్దిపేట జిల్లా ముందు వరుసలో ఉంటుంది. ఎంతోమంది ఈ వ్యాపారాన్ని నమ్ముకొని ఉన్నారు. ధరలు పెరుగుతాయనే ఆశతో వేలాది మంది ప్రజలు స్థలాలను కొనుగోలు చేశారు. అయితే వీటిని కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలే శరణ్యం. అయితే సెప్టెంబరు 8 నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌, నూతన మార్గదర్శకాల రూపకల్పనలో భాగంగా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఈసేవలు స్థంభించాయి. వివాహ సర్టిఫికెట్లు మంజూరు మిన హా మరే సేవలు అందడం లేదు. దీనికి తోడు స్టాంప్‌ పేపర్ల సరఫరా నిలిచిపోయింది. కొత్త రిజిస్ర్టేషన్‌ ఛార్జీలు తెరమీదకు వస్తాయనే ప్రచారం కూడా జరుగుతున్నది.  

జిల్లాలో సిద్దిపేట అర్బన్‌, రూరల్‌, గజ్వేల్‌, చేర్యాల, హుస్నాబాద్‌, దుబ్బాక పట్టణాల్లో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతీరోజు 500 పైగానే డాక్యుమెంట్ల రిజిరస్ర్టేషన్లు ఇక్కడ జరుగుతుండేవి. కొద్దిరోజులుగా వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈనెల 23న మళ్లీ ప్రారంభమవుతాయనే సంకేతాలు వచ్చాయి. అయితే ప్రారంభం రోజున ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందోనని ఇటు రియాల్టర్లు, అటు స్థలాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. 

స్థలాల ధరలపై నివేదిక

సిద్దిపేట శివారులోని గ్రామాల్లో ఎకరం భూమి ధర రిజిస్ర్టేషన్‌ విలువ ప్రకారం రూ.లక్ష మించదు. కానీ బహిరంగ మార్కెట్‌లో రూ. కోటికి పైగానే పలుకుతున్నది. రియల్‌ఎస్టేట్‌ రంగం వృద్ధి చెందడంతో ఎకరాలన్నీ ప్లాట్లుగా, గజాలుగా మారాయి. ఈ గజాల విలువ కూడా రిజిస్ర్టేషన్‌ విలువ ప్రకారం రూ. వందల్లో ఉంటే మార్కెట్‌ ధర మాత్రం రూ. 2వేల నుంచి రూ.లక్ష దాకా పెరిగింది. ప్రతీ డాక్యుమెంట్‌కు రిజిస్ర్టేషన్‌ విలువ ఆధారంగా 6శాతం ఛార్జీలను సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే బహిరంగ మార్కెట్‌ ధరకు, రిజిస్ర్టేషన్‌ ధరకు భారీగా తేడా ఉండడంతో వీటిని సవరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 

 జిల్లావ్యాప్తంగా ఉన్న స్థలాల ధరలకు సంబంధించిన నివేదికను ఆయా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల ద్వారా ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలిసింది. ప్రస్తుత రిజిస్ర్టేషన్‌ ధరలు, మార్కెట్‌ ధరలు, ఇతర అంశాలను పొందుపరిచి పంపించినట్లు సమాచారం. ఈ లెక్కన రిజిస్ర్టేషన్‌ ఛార్జీలు భారీగా పెరగనున్నాయనే ప్రచారం జరుగుతున్నది. 

 భారీగా రిజిస్ర్టేషన్లు పెండింగ్‌

జిల్లాలో ప్రతీరోజు 400 నుంచి 500 డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్లు అయ్యేవి.  స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లతో కార్యాలయాలు కళకళలాడుతుండేవి. రెండు నెలల నుంచి రిజిస్ర్టేషన్లను నిలిపివేయడంతో భారీగా పెండింగ్‌ పడినట్లు తెలుస్తున్నది. సుమారుగా 20వేల నుంచి 25వేల మంది తమ రిజిస్ర్టేషన్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్ర్టేషన్లు పూర్తిగా నిలిచిపోవడంతో రియల్టర్లు సైతం కుదేలయ్యారు. వందలాది మంది దివాళా తీశారు. పెట్టుబడికి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా రూ.10వేలకు గజం చొప్పున పలికిన ఓ భూమిని రూ.7వేలకే విక్రయించామని ఓ రియల్టర్‌ చెప్పుకొచ్చాడు. 

బ్లాకులో స్టాంపు పేపర్లు 

ఏ ఒప్పందం చేసుకోవాలన్నా, ఏ అగ్రిమెంటు రాసుకోవాలన్నా ఈరోజుల్లో స్టాంపు పేపర్‌ ఉండాల్సిందే.  రూ.10 నుంచి రూ.100 వరకు లభించే బాండ్‌ పేపర్లను ఆయా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల నుంచే స్టాంప్‌ వెండర్లకు సరఫ రా చేస్తారు. అక్కడి నుంచే అవసరం ఉన్నవారు కొనుగోలు చేస్తారు. ప్రస్తు తం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోవడంతోపాటు స్టాంప్‌ వెండర్లకు బాండు పేపర్ల సరఫరా నిలిచింది. దీంతో వాటి కొరత ఏర్పడడంతో బ్లాకులో విక్రయిస్తున్నారు. స్టాకు ఉన్న స్టాంప్‌ వెండర్లకు కాసులు కురుస్తున్నాయి. చాలా విషయాల్లో బాండు పేపర్ల మీద ఒప్పందాలు ఉండడం, అవి లభించకపోవడంతో అగ్రిమెంట్లు కూడా వాయిదా వేసుకుంటున్నారు. 



Updated Date - 2020-11-20T05:27:06+05:30 IST