సిద్దిపేట సమగ్రాభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-12-21T05:20:27+05:30 IST

సిద్దిపేట అర్బన్‌, డిసెంబరు 20 : సిద్దిపేట నలుమూలల అభివృద్ధికి కృషిచేస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట అర్బన్‌ మండలం బొగ్గులోనిబండ గ్రామంలో నిర్మించిన ఐదు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించి మాట్లాడారు.

సిద్దిపేట సమగ్రాభివృద్ధికి కృషి
బొగ్గులోనిబండలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు

మంత్రి హరీశ్‌రావు 

బొగ్గులోనిబండలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రారంభం

సిద్దిపేట అర్బన్‌, డిసెంబరు 20 : సిద్దిపేట నలుమూలల అభివృద్ధికి కృషిచేస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట అర్బన్‌ మండలం బొగ్గులోనిబండ గ్రామంలో నిర్మించిన ఐదు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే హైదరాబాద్‌ రోడ్డులో పలు జిల్లా భవనాలను తీసుకొచ్చామని, హన్మకొండ రోడ్డులో ఉన్న మిట్టపల్లి సమీపంలో కూడా త్వరలో రైల్వే స్టేషన్‌ రానున్నదని చెప్పారు. అలాగే జిల్లా కోర్టు, జిల్లా పరిషత్‌ భవనాలనూ అక్కడే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అటు కరీంనగర్‌ ఇటు మెదక్‌ రోడ్డు వైపు కూడా కొన్ని కంపెనీలను, జిల్లా భవనాలను తీసుకొచ్చామన్నారు. గ్రామానికి రూ.10 లక్షలతో మహిళా భవనం, రూ.20 లక్షలతో శ్మశాన వాటికను మంజూరు చేసినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పడ్డ గ్రామపంచాయతీ కాబట్టి త్వరలో గ్రామపంచాయతీ భవనానికి నిధులు ఇస్తామన్నారు. గ్రామంలో మీ ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి కొత్త స్కీమ్‌ ద్వారా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. రంగదాంపల్లి, మిట్టపల్లి నుంచి బొగ్గులోనిబండకు బీటీ రోడ్డు వేయించామని తెలిపారు. సిద్దిపేట చుట్టుపక్కల ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సీఎం హామీనిచ్చారని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. దీనివల్ల పట్టణంలో ట్రాఫిక్‌, పొల్యూషన్‌ తగ్గుతుందని తెలిపారు. ఈ సందర్భంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల వద్ద మహిళలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం బొగ్గులోనిబండ గ్రామ పేరును పాండవపురంగా మార్చాలని గ్రామస్థులు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ వంగ సవితాప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్‌ మాధవీలత, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శంకర్‌, తహసీల్దార్‌ విజయ్‌సాగర్‌, ఎంపీడీవో సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మనస్వినికి మంత్రి అభినందన

సిద్దిపేట పట్టణ కౌన్సిలర్‌ గ్యాదరి రవీందర్‌ కూతురు మనస్విని నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాలలో ప్రభుత్వ కోటాలో ఫ్రీ మెడిసిన్‌ సీటు లభించింది. ఆదివారం మంత్రి హరీశ్‌రావు స్వీట్‌ తినిపించి, అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన ప్రాంతం నుంచి కూడా మెడికల్‌ రంగం వైపు విద్యార్థులు వెళ్తున్నారని ఇది శుభ పరిణామమన్నారు. మనస్విని ఎంబీబీ్‌సని పూర్తిచేసి సిద్దిపేట ప్రజలకు సేవలందించాలని పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-21T05:20:27+05:30 IST