ఆరోగ్యమస్తు
ABN , First Publish Date - 2020-12-07T05:45:47+05:30 IST
సిద్దిపేట పట్టణ శివారులోని ఎన్సాన్‌పల్లిలో ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించారు. ఇక్కడ తరగతులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు బ్యాచులు కలిపి సుమారుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. దీనికి సంబంధించిన ఆస్పత్రిని మాత్రం సిద్దిపేట ఏరియా ఆస్పత్రి వద్ద కొనసాగిస్తున్నారు. అయితే ఇది 500 పడకల ఆస్పత్రిగానే ఉంది.

మెడికల్ కళాశాలకు అనుబంధంగా 960 పడకల ఆస్పత్రి నిర్మాణం
అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే
ఎన్సాన్‌పల్లి శివారులో స్థలం కేటాయింపు
10న సీఎం కేసీఆర్ భూమిపూజ
ఇప్పటికే పూర్తయిన కాలేజీ భవనాలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 6 : ‘వైద్యోనారాయణహరి’ అని అంటారు.. వైద్యుడు దేవుడితో సమానమని చెబుతారు. ఒక్క వైద్యుడు ఉంటేనే వందలాది మంది రోగులకు ధైర్యం ఉంటుంది. అలాంటిది వందలాది మంది వైద్యులు అందుబాటులో ఉంటే అంతకన్నా ఇంకేం కావాలనే భరోసా కల్పించవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఇలాంటి మనోధైర్యమే లభించింది. ఇప్పటికే అందుతున్న వైద్యసేవలను మరింత స్థాయికి తీసుకెళ్లే బృహత్తరమైన కార్యాన్ని తలపెట్టారు.
సిద్దిపేట పట్టణ శివారులోని ఎన్సాన్‌పల్లిలో ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించారు. ఇక్కడ తరగతులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు బ్యాచులు కలిపి సుమారుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. దీనికి సంబంధించిన ఆస్పత్రిని మాత్రం సిద్దిపేట ఏరియా ఆస్పత్రి వద్ద కొనసాగిస్తున్నారు. అయితే ఇది 500 పడకల ఆస్పత్రిగానే ఉంది.
రూ.225 కోట్ల వ్యయంతో పెద్దాస్పత్రి నిర్మాణం
హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలకే పరిమితమైన ఉచిత పెద్దాస్పత్రిని సిద్దిపేటలో నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈనెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ భారీ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. మొత్తం 7 అంతస్తులతో విశాలంగా దీనిని నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఇందుకోసం రూ.225 కోట్లు కేటాయించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఈ పెద్దాస్పత్రి కొనసాగుతుంది. ఇక్కడ ఫైనలియర్ చదివే విద్యార్థులతో పాటు వందల సంఖ్యలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇప్పటికే కళాశాలకు సంబంధించిన భవనాలు నిర్మించారు. విద్యార్థులకు హాస్టళ్లు కూడా ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణంతో ఈ ప్రాంతమంతా మెడికల్ హబ్‌లా మారింది.
అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే..
కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన అన్ని రకాల వైద్యసేవలను ఇకపై సిద్దిపేట పెద్దాస్పత్రిలోనూ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలను పూర్తిగా అందిస్తున్నారు. అత్యవసరమైతేనే హైదరాబాద్‌లోని గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దాస్పత్రి నిర్మించాక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకుండా ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఐసీయూ, డయాలసిస్ సేవలు, స్కానింగ్‌లు, ఎమర్జెన్సీ సేవలను మరింత విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వివిధ హోదాల్లోని డాక్టర్లు నిరంతరం ఇక్కడే ఉండేలా వారికి క్వాటర్లు కూడా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఫైనలియర్‌లో ప్రవేశిస్తారు. 24 గంటల పాటు వీరి సేవలను రోగులకు అందిస్తారు. ఇలా ప్రతీ ఏటా ఫైనలియర్ విద్యార్థులు ఇకపై అందుబాటులో ఉంటారు.
మంత్రి హరీశ్ చొరవతోనే..
2016 అక్టోబరు 11వ తేదీన సిద్దిపేట జిల్లా ఆవిర్భావ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం విన్నవించారు. కొద్ది రోజులకే కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఎన్సాన్‌పల్లి శివారులో స్థలం కేటాయించడమే గాకుండా 2017లోనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా భూమిపూజ చేశారు. రెండేళ్ల వ్యవధిలోనే కాలేజీ భవనాలు పూర్తయ్యేలా మంత్రి హరీశ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు 960 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేయడంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఏడాది సమయంలోనే నిరుపేదలకు దీనిని అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టారు.