పేదల ఆశయాలను నెరవేరుస్తాం
ABN , First Publish Date - 2020-12-28T04:55:39+05:30 IST
సిద్దిపేటఅర్బన్, డిసెంబరు 27 : ప్రతి వ్యక్తికి తనకు సొంత ఇల్లు ఉండాలనే ఆశయం ఉంటుందని పేదవారిఆశయాలను డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేసి నెరవేరుస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అన్ని హంగులతో డబుల్ ఇళ్ల నిర్మాణం
లబ్ధిదారుల ఎంపికలో లంచం అడిగినట్టు నిరూపిస్తే రూ.10వేలు గిఫ్ట్ : మంత్రి హరీశ్‌రావు
కేసీఆర్ నగర్‌లో 168 లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ
సిద్దిపేటఅర్బన్, డిసెంబరు 27 : ప్రతి వ్యక్తికి తనకు సొంత ఇల్లు ఉండాలనే ఆశయం ఉంటుందని పేదవారిఆశయాలను డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేసి నెరవేరుస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణం కేసీఆర్‌నగర్ కాలనీలో 168 మంది లబ్ధిదారులకు నాలుగో దఫా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దలు ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అనే నానుడిని వాడేవారని ప్రస్తుతం అర్హులైన ప్రతీ పేదవాడికి ప్రభుత్వమే అన్ని హంగులతో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి పంపిణీ చేస్తుందన్నారు. సిద్దిపేట పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని నాణ్యతతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి చుట్టూ పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎవరైనా లంచం అడిగితే నిరభ్యంతరంగా చెప్పాలని లంచం అడిగిన వ్యక్తి పేరు చెబితే రూ.10వేల గిఫ్ట్ ఇస్తామని ఆయన చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరిగిందని అందుకే ప్రతీ వార్డులో అర్హుల లిస్టు వేశామని మంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నన్ను తిట్టిన బీజేపీ నాయకుడికి కూడా ఇల్లు వచ్చింది అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేశాం అని మంత్రి గుర్తు చేశారు.
చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి
సిద్దిపేట చర్చిలో ఆదివారం మంత్రి హరీశ్‌రావు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతి వెళ్లాలని, క్రిస్మస్ పర్వదినాన వేడుకలకు రాలేకపోయానన్నారు. ఆదివారం ఏసుప్రభు ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ సందర్భం గా చర్చి ఫాదర్, నిర్వాహకులు మంత్రి హరీశ్‌రావు సన్మానించారు.
వీలవ్‌యు ఫౌండేషన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
సిద్దిపేట అర్బన్/ సిటీ : సమాజసేవలో వీలవ్‌యు ఫౌండేషన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వీలవ్‌యూ ఫౌండేషన్ వారి సహకారంతో ఆదివారం మంత్రి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వైద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే సంకల్పం ఉండాలన్నారు. పిల్లలకు సామాజిక స్పృహ పాఠశాల నుంచి మొదలవ్వాలని, మార్పు అనేది చిన్నప్పటి నుంచి మొదలైతే సమాజానికి ఎంతో మంచిదన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
బాతిక్ బాలయ్య మృతి తీరని లోటు
సిద్దిపేటఅర్బన్/సిటీ : అంతర్జాతీయ బాతిక్ చిత్ర కళాకారుడు యాసాల బాలయ్య మృతి చిత్ర కళారంగానికి తీరని లోటని మంత్రి అన్నారు. ఆదివారం బాతిక్ చిత్ర కళాకారుడు బాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలయ్య గీసిన పల్లె జీవన చిత్రాలను, ఆయన చిత్ర కళారంగానికి చేసిన సేవలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అధైర్య పడకండి.. అన్ని విధాలా ఆదుకుంటాం
ఈ మధ్య కాలంలో చనిపోయిన టీఆర్‌ఎస్ స్థానిక కార్యకర్తలు, నాయకుల కుటుంబాలను మంత్రి హరీశ్‌రావు ఆదివారం పరామర్శించారు. పట్టణంలోని28వ వార్డు టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్శద్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని, అదేవిధంగా నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ గంగాపురంలో శ్రీనివాస్ గుండెపోటుతో అకాల మరణం చెందగా అతని కుటుంబాన్ని మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు.
