కరోనాతో భయపడొద్దు..అండగా ఉంటాం

ABN , First Publish Date - 2020-08-16T10:29:45+05:30 IST

కరోనా వైర్‌సకు భయపడాల్సిన పని లేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి

కరోనాతో భయపడొద్దు..అండగా ఉంటాం

అందుబాటులో అవసరమైన మందులు

అందరూ అప్రమత్తంగా ఉండాలి

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రాధాన్యం

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ

జిల్లాలో నిరాడంబరంగా స్వాతంత్య్ర వేడుకలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఆగస్టు 15 : కరోనా వైర్‌సకు భయపడాల్సిన పని లేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రజలకు భరోసా కల్పించారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్లక్ష్యం, భయంతో సకాలంలో చికిత్స తీసుకోకపోతేనే ప్రాణాంతకం అవుతుందన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనన్ని మందులను అందుబాటులో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. రాజధాని హైదరాబాద్‌లో విజృంభించిన కరోనా వైరస్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందన్నారు.


అయితే జిల్లాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని దానిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కొవిడ్‌ రోగుల కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వందపడకలు, ఎంఎన్‌ఆర్‌ ఆసుపత్రిలో మరో వంద పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, పీపీఈ కిట్లు, హోంక్వారంటైన్‌ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. అయినా ప్రజలందరూ అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. 


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యంఇస్తున్నదని మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. యువత ఈ అంశంపై దృష్టి సారించి ఆవిష్కరణలను రూపొందించాలన్నారు. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. అనంతరం జిల్లా నుంచి ఎంపికైన ఆవిష్కరణల పని తీరును ఆయన పరిశీలించారు. ఆవిష్కర్తలు సంగమేశ్వర్‌, విఘ్నేశ్వర్‌ను అభినందించి సన్మానించారు. వీల్‌ బేస్డ్‌ ఫర్టిలైజర్‌ స్ర్పే పంప్‌ ఆవిష్కర్త సంగమేశ్వర్‌కు ప్రోత్సాహకంగా రూ.11 వేల చెక్కును డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ అందజేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్‌ హన్మంతరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి మహమూద్‌ అలీ గెస్ట్‌హౌ్‌సలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 


ఆర్భాటాలకు దూరంగా

పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ప్రతి యేటా ఆడంబరంగా జరిగే స్వాతంత్య్ర  వేడుకలు ఈసారి కరోనా కారణంగా కలెక్టరేట్‌ ఆవరణలో నిరాడంబరంగా జరిగాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ప్రసంగించలేదు. ముప్పావుగంటలో కార్యక్రమాన్ని ముగించేసి మంత్రి మహమూద్‌ అలీ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. వేడుకలకు హాజరైన వారందరూ మాస్కులను ధరించి వచ్చారు. అంతకు ముందు కలెక్టర్‌ హన్మంతరావు తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు.

Updated Date - 2020-08-16T10:29:45+05:30 IST