అన్నం పెట్టే రైతులకు సున్నం పెడతారా?

ABN , First Publish Date - 2020-12-19T05:53:30+05:30 IST

ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు కేంద్ర ప్రభుత్వం సున్నం పెడుతున్నదని కుల వివక్ష పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం ఎద్దేవా చేశారు.

అన్నం పెట్టే రైతులకు సున్నం పెడతారా?
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కేవీపీఎస్‌ నాయకులు

 కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం 

 ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా


సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 18: ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు కేంద్ర ప్రభుత్వం సున్నం పెడుతున్నదని కుల వివక్ష పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం ఎద్దేవా చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట కేవీపీఎస్‌ నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో 22 రోజులుగా ఎముకలు కొరికే చలిలో రైతులు ఉద్యమిస్తున్నా కేంద్రం చలించకపోవడం బాధాకరమన్నారు. ప్రజలందరూ రైతుల ఉద్యమానికి అండగా నిలిచి కేంద్రానికి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ ధర్నాలో విద్యాసాగర్‌, శివకుమార్‌, నర్సింహులు, సుభాష్‌, దాస్‌, సదానందం, శంకర్‌, గణపతి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


వ్యవసాయాన్ని కార్పొరేట్‌ పరం చేసేందుకు కుట్ర


వ్యవసాయాన్ని కార్పొరేట్‌పరం చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర కుట్ర పన్నుతున్నారని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జయరాజ్‌ విమర్శించారు. ఢిల్లీలో రైతులు చేస్నున్న దీక్షలకు మద్దతుగా వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్‌ వద్ద చేపట్టిన నిరసన దీక్ష శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు, ప్రజల ప్రయోజనాల కంటే కార్పొరేట్లే ప్రధాని మోదీకి ఎక్కువయ్యారని, వారికి మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చారని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహించే వరకు పోరాడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. ఈ దీక్షలో వివిధ సంఘాల నాయకులు మాణిక్యం, విద్యాసాగర్‌, బాగారెడ్డి, యాదగిరి, నర్సింలు, తారాసింగ్‌, రాజు, అవాజ్‌, ఖయ్యుమ్‌ తదితరులు పాల్గొన్నారు.


జియో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా


రైతులకు మద్దతుగా సీపీఐ నాయకులు సంగారెడ్డిలోని రిలయన్స్‌ జియో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్‌ మాట్లాడుతూ.. రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జి చేస్తూ, బాష్పవాయువను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే బీజేపి పతనం ఆరంభమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వజీర్‌బేగ్‌, మహబూబ్‌ఖాన్‌, గంగయ్య, సిరాజ్‌, రాహుల్‌, ఖలీల్‌, ముజాహెద్‌, ఇబ్రహీం, అశోక్‌, ఖమరుద్దిన్‌ పాల్గొన్నారు.


Read more